ఏమిటీ చిల్లర ఆరోపణలు?

14 Nov, 2020 04:26 IST|Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై హోంమంత్రి సుచరిత మండిపాటు

మీరు నిందితులకు బెయిలిప్పిస్తే మేం రద్దు కోసం పిటిషన్‌ వేశాం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను మరిచిపోయి హైదరాబాద్‌లోనే గడుపుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్‌ మీటింగ్‌ల్లో ప్రభుత్వంపై, అధికారులపై చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత హితవు పలికారు. నంద్యాలకు చెందిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతూ శుక్రవారం హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబుకు సెక్షన్లు తెలియవా? 
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులైన సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ ఐపీసీ 306 ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. నిందితులకు టీడీపీ న్యాయవాది ద్వారా బెయిల్‌ ఇప్పిస్తే దాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్‌కు కూడా వెళ్లిందని గుర్తు చేశారు. గౌరవ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తే పోలీస్‌ శాఖను నిందించడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు.  

సీబీఐ విచారణ అప్పుడేమైంది? 
ఇప్పుడు ప్రతి అంశంపైనా సీఐబీ విచారణకు డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు ఆయన హయాంలో జరిగిన మహిళా అధికారి వనజాక్షిపై దాడి, విద్యారి్థని రిషితేశ్వరి ఆత్మహత్య, విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలపై నాడు ఎందుకు అదే విచారణ కోరలేదని హోంమంత్రి ప్రశ్నించారు. అప్పుడు ఆయనే సీబీఐకి నో ఎంట్రీ అని అడ్డుకోలేదా? అని నిలదీశారు. 

దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. 
లక్షల మంది ఈఎస్‌ఐ కార్మీకుల ఇన్సూరెన్స్‌ సొమ్ము కాజేసిన అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించి చంద్రబాబు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అతి దారుణమైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర అరెస్టును కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. జైలు, బెయిలు, శిక్షల గురించి చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆయన ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు.    

మరిన్ని వార్తలు