చంద్రబాబు ఎప్పటికీ దళిత ద్రోహే

6 Nov, 2022 04:31 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రులు మేరుగు, పెద్దిరెడ్డి

వారికి సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్‌ 

దళితుల ఆత్మీయ సదస్సులో మంత్రులు మేరుగు, పెద్దిరెడ్డి

తిరుపతి ఎడ్యుకేషన్‌/అలిపిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా... అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని ఓర్వలేక బురదజల్లే కార్యక్రమానికి తెరతీశారంటూ విమర్శించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్‌ అపి అన్నారు.  

సబ్‌ ప్లాన్‌ కంటే అధికంగా దళితులకు ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్‌ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో అసమానత్వాన్ని తొలగించి సమానత్వం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్‌ అని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 98.44శాతం ఎన్నికల హామీలను అమలుచేసిన ఘనత జగన్‌దేనన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను ఔపోసనం చేసుకుని వాటిని చక్కగా అమలుచేస్తున్న జగన్‌కు దళితులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీలు డాక్టర్‌ గురుమూర్తి, రెడ్డప్ప, తిరుపతి, సత్యవేడు, గూడూరు, పలమనేరు ఎమ్మేల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్, వెంకటె గౌడ, తదితరులు పాల్గొన్నారు.  

ఆ ప్రాంతాల్లో సభపెట్టి మూడు రాజధానులు వద్దని చెప్పగలవా? 
చంద్రబాబు ఉత్తరాంధ్ర, తిరుపతిలో బహిరంగ సమావేశాలు పెట్టి మూడు రాజధానులు వద్దని మాట్లాడగలడా... అని మంత్రి మేరుగు నాగార్జున సవాల్‌ విసిరారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుమారుడి స్నేహితులే పవన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని విమర్శించారు.

‘నీ వాళ్ల చేతితోనే నేడు రాళ్లు వేయించుకున్నావు.. భవిష్యత్‌లో ప్రజలే నీపై రాళ్లు వేస్తారు’ అంటూ చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు రోడ్డు విస్తరణ చేస్తుంటే అవగాహన లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు