సామాజిక విప్లవానికి నాంది పలికిన సీఎం 

12 Apr, 2022 04:06 IST|Sakshi

కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే

బాబు కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీలకు అసలు స్థానమే లేదు

పేదవాడి గడప వద్దకే పాలన తెస్తున్న సీఎం జగన్‌

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగన్‌ దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్నారని, దేశ చరిత్రలో తొలిసారిగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక విప్లవానికి నాంది పలికారని చెప్పారు. సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. 31లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, 17 వేల జగనన్న కాలనీలతో ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నారని చెప్పారు. 14ఏళ్లు సీఎం చేసిన చంద్రబాబు పేదలకు కట్టిన ఇళ్లు ఎన్ని అని ప్రశ్నించారు.  ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో కింది స్థాయి నుంచి మార్పులు చేస్తూ పేదవాడి గడప వద్దకే పాలన తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. బాబుకు చెప్పుకోవడానికి ఒక్క మంచీ లేదన్నారు. 

మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పరిపాలన లేదు 
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సాహు మహరాజ్, పెరియార్‌ రామస్వామి, జగ్జీవన్‌ రామ్‌ కన్న కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పాలన జరగదని చెప్పారు. అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం ఇంత చేస్తున్న సీఎం జగన్‌ని అభినందించాల్సింది పోయి,  టీడీపీ, చంద్రబాబు, ఎల్లో మీడియా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన బాబు కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించలేదన్నారు. బాబు కేబినెట్‌లో బడుగు బలహీన వర్గాలకు కేవలం 42 శాతం ఇస్తే... సీఎం జగన్‌ తొలి కేబినెట్‌లో 60 శాతం, ఇప్పుడు 70 శాతం పదవులు ఇచ్చారని తెలిపారు.  

మరిన్ని వార్తలు