కండకావరంతోనే లోకేశ్‌ దుర్భాషలు 

9 Sep, 2022 05:19 IST|Sakshi

అడ్డగోలుగా వాగితే నాలుక తెగ్గోస్తాం: మంత్రి మేరుగు నాగార్జున 

దళితులకు రక్షణ లేదనడం దయ్యాలు వేదాలు వల్లించడమే 

బాబు హయాంలో వెలివేతలు, దాడులు ఎవరూ మరిచిపోలేదు  

సాక్షి, అమరావతి: అధికారం పోయిందనే అక్కసుతో అడ్డగోలు విమర్శలు చేస్తున్న చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు వైఎస్సార్‌ కుటుంబంపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. గురువారం వెలగపూడిలోని సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవలేని నారా లోకేష్‌ కండకావరంతో అభ్యంతరకరమైన భాషలో మాట్లాడుతున్నారని మంత్రి నాగార్జున మండిపడ్డారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదంటూ లోకేష్‌ పేర్కొనటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో దళితుల వెలి, దళిత మహిళలను వివస్త్రలను చేయడం, దాడులను ప్రజలు మరిచిపోలేదన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? జడ్జీలుగా పని చేసేందుకు బీసీలు పనికిరారు అని దురహంకార వ్యాఖ్యలు చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బహిరంగ చర్చకు వస్తే దళిత ద్రోహులెవరో తేల్చుకుందామని లోకేష్‌కు సవాల్‌ విసిరారు.  

ఇటు ఆణిముత్యాలు.. అటు ముద్దపప్పు 
దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది వైఎస్సార్‌ కుటుంబమేనని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. వైఎస్‌ రాజారెడ్డి ఈ దేశానికి ఆణిముత్యాల్లాంటి గొప్ప నాయకులను అందిస్తే లోకేశ్‌ లాంటి ముద్దపప్పును నారా కుటుంబం అందించిందని వ్యాఖ్యానించారు. దళితులతో వియ్యం అందుకుని అంబేడ్కర్‌ భావజాలాన్ని భుజాలపై మోస్తున్న కుటుంబం వైఎస్‌ రాజశేఖరరెడ్డిదని చెప్పారు.

వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్సార్, సీఎం జగన్, విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మలపై టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు వాగితే నాలుకలు తెగ్గోస్తానని హెచ్చరించారు. తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రి పదవి సంపాదించి కోట్లు కొల్లగొట్టిన లోకేష్‌కు సీఎం జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదన్నారు. నాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో వేముల రోహిత్‌ అనే దళిత మేధావి చంద్రబాబు నాయుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదన్నారు.

అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీ హాస్టళ్లను మూసివేసిన చరిత్ర కూడా ఆయనదేనన్నారు. అక్కడక్కడా జరిగిన కొన్ని ఘటనలపై సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్‌ కూడా ప్రశంసించిందని మంత్రి నాగార్జున గుర్తు చేశారు.   

మరిన్ని వార్తలు