బీజేపీలో చేరనున్న మెట్రోమ్యాన్‌

18 Feb, 2021 14:21 IST|Sakshi

బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మెట్రోమ్యాన్‌

సాక్షి, న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కేంద్రంలోని అధికార బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. కమ్యూనిస్ట్‌ పాలనను అంతంచేసి.. దైవభూమిలో కాషాయ జెండాపాతాలని భావిస్తోంది. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటములకు చెరమగీతం పాడి కేరళలో పాగావేయాలని ఊవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ వ్యక్తులను, ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పార్టీలోకి అహ్వానిస్తోంది. ఈ క్రమంలో మెట్రోమ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను బీజేపీకి చేర్చుకునేందుకు కమళనాథులు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విజయ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేందరన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఫ్రిబవరి 21న నుంచి కేరళలో విజయ యాత్ర ప్రాంభవుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు ఆయన్ని ఆహ్వానించామని తెలిపారు. 

సురేందరన్‌ ప్రకటనపై స్పందించిన 89 ఏళ్ల మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌‌.. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన చేస్తున్న యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ కూటమికి విధానాలకు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకుందన్నారు. కాగా 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో మరో ఐదునెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది.

ఇక 2011 డిసెంబర్‌ 21న ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్‌ పదవీ విరమణ చేశారు. కొంకణ్‌ రైల్వే, ఢిల్లీ మెట్రోల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైంది. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌కే దక్కుతుంది. దేశంలో తొలి మెట్రో ప్రాజెక్ట్‌ అయిన కోల్‌కతా మెట్రో రైల్‌ రూపశిల్పి ఆయనే కావడంతో మెట్రోమ్యాన్‌గా గుర్తింపబడ్డారు. అంతేకాకుండా భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు.

కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా?

>
మరిన్ని వార్తలు