సీఎం పదవి చేపట్టడానికి నేను రెడీ: శ్రీధరన్‌

19 Feb, 2021 17:33 IST|Sakshi
మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌

బీజేపీలో చేరడానికి కారణం అదే: శ్రీధరన్‌

ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది

న్యూఢిల్లీ: ‘మెట్రో మ్యాన్’‌ శ్రీధరన్‌ రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చేవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని కోరితే.. అందుకు తాను సిద్ధం అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అప్పుల ఊబి నుంచి కేరళను బయటపడేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. 

ఈ క్రమంలో శుక్రవారం శ్రీధరన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీ కోరుకుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలో బరిలో నిల్చుంటాను. పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా ధ్యేయం. ఒకవేళ కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మూడు, నాలుగు ప్రధాన రంగాల మీద దృష్టి పెడతాం. వాటిలో ముఖ్యమైనది మౌలిక వసతుల అభివృద్ధి. మరొకటి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తాం’’ అన్నారు. 

‘‘అలానే కేరళలో ఫైనాన్స్‌ కమిషన్‌ని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నేడు ప్రతి మళయాళీ మీద సగటున 1.2 లక్షల రూపాయల అప్పు ఉంది. ప్రభుత్వం ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే.. నన్ను ముఖ్యమంత్రి పదవి చేపట్టమని ఆహ్వానిస్తే.. ఆ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు శ్రీధరన్‌.

‘‘నేను బీజేపీలో చేరాలనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌ పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు రాష్ట్ర సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. రాష్ట​ అభివృద్ధి కుంటుపడింది. 20 ఏళ్లుగా రాష్ట్రంలోకి ఒక్క పరిశ్రమ రాలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను బీజేపీలో చేరాను. వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే.. కేంద్రం, రాష్ట్రాల మధ్య మంచి సంబంధం ఉంటుంది.. అభివృద్ధి పుంజుకుంటుంది’’ అన్నారు శ్రీధరన్‌. 

చదవండి: బీజేపీలోకి మెట్రోమ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

మరిన్ని వార్తలు