మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

3 Jul, 2023 12:32 IST|Sakshi

మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి

తాజాగా అజిత్‌ పవార్‌ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్‌ వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్‌నాథ్‌ షిండేకు పదవి గండం మొదలైందని,  అజిత్‌ పవార్‌ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని  చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు.

సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్‌నాథ్‌ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్‌కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్‌భవన్‌లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు.  

కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్‌ శరద్‌పవార్‌కు పెద్ద షాక్‌ తగిలినటైంది. అజిత్‌ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్‌ భుజ్‌బల్, దిలీప్‌ వాల్సే పాటిల్, హసన్‌ ముష్రీఫ్, ధనుంజయ్‌ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్‌ పాటిల్, సంజయ్‌ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్‌ తోపాటు డిప్యూటీ స్పీకర్‌ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు