బరిలో పీవీ కూతురు: మజ్లిస్‌ వెనకంజ

6 Mar, 2021 08:17 IST|Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కనిపించని స్పష్టత

సాక్షి,సిటీబ్యూరో : ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్‌– మహబూబ్‌ నగర్‌–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ  ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్‌ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా,  ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే మజ్లిస్‌ పార్టీ ఎన్నికల బరిలో లేని కారణంగా ఏదో ఒక అభ్యర్థికి సహకరించక తప్పదు. అయితే పార్టీపరంగా ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మజ్లిస్‌ కేడర్‌లో అయోమయం నెలకొంది. 

మైత్రి కొనసాగేనా.. 
అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి బలమైన మైత్రిబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు బాహాటంగా సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు  మద్దతు ప్రకటించి స్నేహ్నబంధాన్ని  మరోసారి చాటింది. తాజాగా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనపించడం లేదు. 

పీవీ కూతురు కావడంతోనే.. 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిత్వంపై మజ్లిస్‌ పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోంది. సురభివాణి దేవి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్‌ ఎటూ తేల్చుకోలేక పోతోంది. పీవీ ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి తనయ అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ సహకరించే  పరిస్థితి కనిపించడం లేదు.    

చదవండి: టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే..

మరిన్ని వార్తలు