విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

10 Oct, 2020 13:02 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, విజయవాడ: విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రారంభించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. ప్రతిపక్షం జీర్ణించుకోలేకనే బురదజల్లుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షం ఆనందంగా ఉండలేదని విమర్శించారు. (చదవండి: ‘అక్కడ డబ్బున్న వారికే ప్రాధాన్యత’

‘జగనన్న విద్యాకానుక’పై ఇతర రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో 16 శాతం విద్యాభివృద్ధికే కేటాయిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది. డ్రాప్ ఔట్ శాతం తగ్గించి మెరుగైన విద్య అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ఉన్నత విద్య అందరికీ అందేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న విద్యాకానుక’ అమలవుతోంది. రూ.650 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ కిట్‌లో అందిస్తున్న స్కూలు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు మొదలైన వాటి ఖర్చులని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని సురేష్‌ తెలిపారు. గతంలో కేవలం ఎనిమిదో తరగతి వరకు ‌మాత్రమే యూనిఫామ్స్ ఇచ్చారని, ఇప్పుడు పదవ తరగతి వరకు కూడా అందిస్తున్నామని‌ చెప్పారు. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలంతా భావిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. (చదవండి: దొంగ దీక్షలకు 300 కోట్లు ఊదేశాడు)

మరిన్ని వార్తలు