విపత్తులోనూ శవ రాజకీయాలా?

5 Dec, 2021 04:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తు వల్ల జరగరాని నష్టం జరిగితే.. దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను రక్షించి, భరోసా కల్పించిన ప్రభుత్వాన్ని, అధికారులను కించపరచడం తగదని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా వరదలపై చంద్రబాబు, టీడీపీ నేతల అనైతిక రాజకీయాలను తుర్పారబట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. 

సోమశిలకు ఇంత వరద వస్తుందని వారే అంచనా వేయలేదు
పెన్నా నది చరిత్రలో గత నెలలో భారీ వరద వచ్చింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) లెక్కల ప్రకారం 1882లో సోమశిలకు 5 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 140 ఏళ్ల తర్వాత గత నెల 19న 6 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందంటే పెన్నా బేసిన్‌లో ఏ స్థాయిలో కుంభవృష్టి కురిసిందో అర్థం చేసుకోవచ్చు. పెన్నాకు ఈ స్థాయిలో వరద వస్తుందని సీడబ్ల్యూసీగానీ, బాబు ఆయనే ఏర్పాటు చేశానని చెప్పుకుంటున్న వ్యవస్థగానీ అంచనా వేయలేదు.

అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కులు వచ్చింది
అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌ వే ప్రవాహం విడుదల గరిష్ట సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు. గత నెల 17న వరద రాలేదు. 18న ఉదయం 10 గంటలకు 12 వేల క్యూసెక్కులు వస్తే.. అంతకంటే ఎక్కువ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును ఖాళీ చేశాం. రాత్రి 8 గంటలకు 42 వేల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగితే అంతే స్థాయిలో విడుదల చేశాం. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశాం. పింఛా ప్రాజెక్టు స్పిల్‌ వే వరద విడుదల సామర్థ్యం 50 వేల క్యూసెక్కులు. అయితే, అక్కడకు 1.30 లక్షల క్యూసెక్కులు రావడంతో రింగ్‌ బండ్‌ తెగిపోయింది. గత నెల 19న రాత్రి పింఛా, బాహుదా, చెయ్యేరు బేసిన్‌లలో 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం పడటంతో తెల్లవారుజామున 3 – 4 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న ఐదు గేట్లలో ఒక్కో గేటు నుంచి 40 వేల క్యూసెక్కులు విడుదల చేయవచ్చు. సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు వరద వస్తే దిగువకు వరద ఎలా వెళ్తుంది? అందువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీని వల్లే కొంత మంది చనిపోయారని కేంద్ర బృందం చెబుతోంది.

ఈ పాపం చంద్రబాబుదే
ప్రకృతి విపత్తు వల్ల జరగరానిది జరిగితే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం చంద్రబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనం. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని, 40 ఏళ్లు రాజకీయ అనుభవముందని చెప్పుకునే వ్యక్తి ఇలా వ్యవహరించడం హేయం. డ్యామ్‌ సేఫ్టీ కమిటీ 2017లో అన్నమయ్య ప్రాజెక్టును తనిఖీ చేసి.. 1.30 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనంగా స్పిల్‌ వే నిర్మించాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్‌ వే నిర్మించకుండా రెండున్నరేళ్లపాటు చంద్రబాబు గాడిదలు కాశారా? అదే నిర్మించి ఉంటే ఈ రోజున అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయే అవకాశమే ఉండేది కాదు. ఈ పాపానికి మూలకారణం చంద్రబాబే.

రాజకీయ అవసరాల కోసమే షెకావత్‌ అవాస్తవాలు
ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. కానీ..  కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్, సుజనా చౌదరి మాటలు విని, రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం తగదు. గతేడాది హిమానీ నదాలు కరగడం వల్ల ఒక్క సారిగా వచ్చిన వరదకు ఉత్తరాఖండ్‌లో 170 మంది మరణించారు. ఆ పాపం కేంద్రానిదా లేక ఉత్తరాఖండ్‌ సర్కార్‌ది అని అనుకోవాలా?

సహాయక కార్యక్రమాలకే సీఎం జగన్‌ పెద్దపీట
ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్తే వరద బాధితులకు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. బాధితులను వేగంగా పునరావాస శిబిరాలకు తరలించి ఆదుకున్నారు. వరద తగ్గాక ప్రజలను సొంతూళ్లకు చేర్చాం. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాం. సహాయక చర్యలు ముగిశాక బాధితులను సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. సహాయం అందిందో లేదో తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తరహాలో ప్రచార పిచ్చితో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా సీఎం జగన్‌ వ్యవహరించలేదు. గోదావరి పుష్కరాల్లో ప్రచార పిచ్చితో, బోయపాటి సినిమా కోసం 38 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకూ, సీఎం వైఎస్‌ జగన్‌కూ ఇదీ తేడా! 

మరిన్ని వార్తలు