సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ నిర్ణయం.. కాదనే ధైర్యం టీడీపీకి ఉందా?

8 Dec, 2022 15:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని.. మాటలు తప్ప చేతలు లేవని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు బీసీల గురించి ఏరోజైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు సీఎం జగన్‌ పారదర్శక పాలన అందిస్తున్నారు. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి అన్నారు. బీసీల సభ గురించి టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సభ సక్సెస్‌ కావడం జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరి గురించైనా చులకన భావంతో మాట్లాడటం సరికాదు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

‘‘బీసీ మంత్రులకు పవర్ లేదంటూ టీడీపీ బీసీ నేతలు విమర్శించారు. తోటి బీసీలను అవమానపరచటమే ఇది. నామినేటెడ్ పోస్టులు కూడా టీడీపీ హయాంలో ఇవ్వలేదు. ఎంతసేపూ చంద్రబాబుకు చెక్క భజన చేయటమే ఆ పార్టీ నేతల పని. జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బీసీలను అందలం ఎక్కించారు. 50 శాతం పోస్టులు బీసీలకు దక్కేలా జగన్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కాదనే ధైర్యం టీడీపీ చేయగలదా?’’ అంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

‘‘తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసి జగన్ పరిపాలన చేస్తున్నారు. బీసీలందరికీ మేలు జరగాలనీ, అందరికీ మంచి జరగాలని సంక్షేమ పథకాలు తెచ్చారు. రాజ్యసభలో నలుగురు బీసీలు ఉన్నారు. ఇది వాస్తవం కాదా?. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా? అన్నాడు చంద్రబాబు. ఆవేదన చెప్పుకోవడానికి వచ్చిన బీసీలకు తోకలు కత్తిరిస్తానన్నారు. ఇవన్నీ వాస్తవం కాదా?. అందుకే ఆ బడుగు, బలహీన వర్గాల కోసమే జగన్ ఈ సంక్షేమ పథకాలు తెచ్చారు. 16 లక్షల మందికి వీటి లబ్ధి చేకూరింది. మరి చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేయలేదు’’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు.
చదవండి: రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలి: సజ్జల

మరిన్ని వార్తలు