ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత అక్కసు: మంత్రి బొత్స

5 Dec, 2022 14:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత అక్కసు? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ప్రజలను మభ్యబెట్టి ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడమే వాటి లక్ష్యం. ప్రజల్లో అశాంతి రేకెత్తించాలని చూస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబసభ్యులే.. ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి అన్నారు. ‘‘రెండు లక్షల మందిని తీసేస్తున్నామని మీకెవరు చెప్పారు. ఆ పత్రికా యాజమాన్యాలకేమైనా చెవిలో చెప్పామా’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.

‘‘151 సీట్లు ఇచ్చి మా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ  జనరంజకంగా సీఎం పాలన చేస్తున్నారు. ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి చర్చ జరగలేదు. తప్పుడు ప్రచారాలు చేస్తారు కాబట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చదవండి: బాబుకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్‌ జరుగుతుందా?: సజ్జల

మరిన్ని వార్తలు