‘పడిపోయిన టీడీపీని లేపడానికి ఎల్లోమీడియా ప్రయత్నాలు’

29 Jul, 2021 16:48 IST|Sakshi

ప్రతిఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నది సీఎం జగన్‌ సంకల్పం

పేదలకు కట్టిస్తున్న ఇళ్లపై కావాలనే టీడీపీ తప్పుడు విమర్శలు

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: పడిపోయిన టీడీపీని లేపడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తోందని.. చంద్రబాబు చెప్పిన అవాస్తవాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నది సీఎం జగన్‌ సంకల్పమని తెలిపారు. పేదలకు కట్టిస్తున్న ఇళ్లపై టీడీపీ కావాలనే తప్పుడు విమర్శలు చేస్తోందని నిప్పులు చెరిగారు.

‘‘రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చాం. వైఎస్సార్‌ హయాంలో 21 లక్షలకు పైగా ఇళ్లను కట్టించారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల ఇళ్లనే కట్టించారు. సీఎం జగన్ 28 లక్షల 30 వేల ఇళ్లు కట్టిస్తున్నారు. జగనన్న కాలనీల్లో 340 ఎస్‌ఎఫ్‌టీతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

‘‘చంద్రబాబు సర్కార్‌ టెక్నాలజీ పేరుతో టిడ్కో ఇళ్లను ముంచేసింది. వాటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. టిడ్కోలో తీసుకునేవారికి రూ.5.5 లక్షల విలువైన ఇంటిని రూ.1 కే ఇస్తున్నాం. ప్రభుత్వం ఇల్లు ఉచితంగా ఇస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే బాధతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఆనాడు టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ దోచుకుంటే ఎల్లోమీడియా ప్రశ్నించిందా?. 2014లో టీడీపీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేయలేదనే ఓడించారని’’ మంత్రి బొత్స అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌పై ప్రతి పైసా కేంద్రం పెట్టాలని.. చంద్రబాబు తన కమీషన్ల కోసం రాజీ పడ్డారని బొత్స దుయ్యబట్టారు. అంచనాలు తగ్గించినా ఒప్పుకున్నారన్నారు. మేం చట్టం ప్రకారం, కేటాయింపుల ప్రకారం వెళ్ళాలని కోరామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

మరిన్ని వార్తలు