డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు సోమువీర్రాజు స్థాయికి తగదు

18 Jan, 2021 16:23 IST|Sakshi

అనంతపురం: ఆలయాలపై దాడుల కేసులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సోమువీర్రాజు స్థాయికి తగదని హితవు పలికారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షడిగా వ్యవహరిస్తున్న ఆయన.. బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. 

ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం డీజీపీ చేసిన తప్పా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసు వ్యవస్థ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే.. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా డీజీపీనే టార్గెట్‌ చేయడం వారి బరితెగింపుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులు ఎంతటివారైనా వదిలపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.

కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబు రాష్ట్రంలో మనుగడ అసాధ్యమని తెలిసి మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని  ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు రాకూడదనే చంద్రబాబు ఆధ్వర్యంలోని దుష్టశక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రథయాత్రపై స్పందిస్తూ.. యాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు