లోకేష్‌బాబుకు మినహా బాబు ఎవరికైనా ఉద్యోగమిచ్చారా?

13 Jan, 2021 19:39 IST|Sakshi

విజయనగరం: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ప్రజలు..  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఛీ కొడుతున్నా, ఆయన బుద్ధి మాత్రం మారడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అండ్‌ కో ఆధ్వర్యంలో జరుగుతున్న కుతంత్రాలు బట్టబయలవుతున్నా ఆయనలో కనీస పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ప్రజలు షాక్‌ ఇచ్చినా బాబు ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పులేదని చురకలు వేశారు. 

గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన హయాంలో లోకేశ్‌బాబుకు మినహా ఎవరికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం అమరావతిని, దోపిడీ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్‌ను వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. పేదలకు ఏనాడైనా ఇళ్ల పట్టాలిచ్చారా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు ఎందుకు అంత ఆక్రోశం అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సస్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని చంద్రబాబు.. ట్రస్ట్‌ అంతర్గత విషయాల్లో తల దూర్చడం తగదన్నారు. ఆనంద గజపతి రాజు ట్రస్ట్‌ చైర్మన్ గా ఉండటం ఇష్టం లేని అశోక గజపతి రాజు మాన్సస్ రద్దు కోసం లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు