రేవంత్, షర్మిల మాటలన్నీ అబద్ధాలే!

18 Feb, 2023 01:05 IST|Sakshi

ఆరోపణలు రుజువుచేస్తే నేను రాజీనామా చేస్తా 

లేదంటే వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలి 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌  

జనగామ: పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని రేవంత్‌రెడ్డి, వైఎస్‌ షర్మిల తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే ఆ ఇద్దరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం జైలుకు వెళ్లానే తప్ప.. అవినీతి, అక్రమాలు చేసికాదు’అని ఆయన అన్నారు. రేవంత్‌ మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న చాలామందిపైన భూ దందా, కబ్జా కేసులు ఉన్నాయన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌.. ఇప్పటికీ చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్నారన్నారు. రేవంత్, షర్మిలకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తాను పట్టుబట్టి చంద్రబాబుకు ఇష్టం లేకున్నా, తెలంగాణకు అనుకూలంగా ఆయనతో లెటర్‌ ఇప్పించానన్నారు.

‘ఇంటర్‌ వరకే చదువుకున్నా.. ప్రజల మనోభావాలను వందశాతం చదివినా.. వారి అవసరాలను తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నా’అని చెప్పారు. ‘నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను.. ఒకేచోట రెండోసారి గెలుస్తాననే నమ్మకం లేని రేవంత్‌రెడ్డి తనతోపాటు సీఎం, ఎమ్మెల్యేలను చులకన చేసి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఐరన్‌లెగ్‌గా మారిపోతున్నారని సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారని ఆరోపించారు.

గత ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తమ తాత, ముత్తాలకు 16 వందల ఎకరాల భూములు ఉండేవని.. ప్రజా సేవ కోసం అమ్ముకుంటూపోగా, ఇప్పుడు తమకు వంద ఎకరాలు కూడా లేవన్నారు. 500 మంది కిరాయి గూండాలతో కారులో తిరుగుతూ పాదయాత్ర పదాన్ని అపహాస్యం చేస్తున్నారని రేవంత్‌పై ఆయన ఫైర్‌ అయ్యారు.  

మరిన్ని వార్తలు