పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా?

5 Feb, 2023 18:13 IST|Sakshi

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాలకుర్తి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఓటమి ఎరుగని నేత, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎర్రబెల్లిని ఓడించగల నేత పాలకుర్తిలో లేరనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన్ను ఓడించే వారి కోసం అటు కాంగ్రెస్, ఇటు కమలం పార్టీ భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్నాయి. మరి ఎర్రబెల్లి విజయానికి ఎవరైనా బ్రేకులు వేయగలుగుతారా?

పోరాటాల పురిటిగడ్డ
పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రబెల్లికి కంచుకోటగా మారింది పాలకుర్తి. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి రెండు సార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు.

విపక్ష అభ్యర్థుల బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి విజయం సాధిస్తారు. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణాలో సీఎం కేసిఆర్ తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్న వ్యక్తిగా ఎర్రబెల్లి ఉన్నారు. ఓటమి ఎరుగని నేతకు రాబోయే ఎన్నికల్లో చుక్కలు చూపేందుకు కాంగ్రెస్, బిజేపి కసరత్తు చేస్తున్నాయి.

ఎర్రబెల్లిని ఎదుర్కునే బలమైన నేత కోసం వెతికే పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకులను కాదని ఎన్ఆర్ఐలపై దృష్టి పెడుతున్నాయి.  ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపారు. అయితే ఎర్రబెల్లిపై పోటీకి ఎన్ఆర్ఐలు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. స్థానిక నేతలు మాత్రం చాలా మంది పోటీకి సై అంటున్నారు.

ఎర్రబెల్లి వర్సెస్‌ కొండా
ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ నుంచి కొండా మురళీ పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. మురళి.. ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఏనాటి నుండో రాజకీయంగా వైరం కొనసాగుతోంది. ఎర్రబెల్లిని ఓడించాలన్న పట్టుదలతో కొండా మురళి వున్నారు. అయితే మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురాంరెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు.

స్థానిక నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవ్వరనేది క్లారిటీ లేకపోయినప్పటికి ఎవరికి వారే పాలకుర్తి టిక్కెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు.  ఎర్రబెల్లి సుధాకర్ రావు, యతి రాజారావు కుటుంబాల నుండి ఎవరో ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిజేపిలో చేరితే ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డిని కూడా చేర్చుకుని బరిలో నిలిపేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రఘురాంరెడ్డి పాలకుర్తిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.

మంత్రిగారికి మార్కెలెన్ని?
పాలకుర్తి నియోజకవర్గం.. అభివృద్ది విషయంలో ఉమ్మడి జిల్లాలోనే ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రాన్ని, సోమేశ్వరాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి కారిడార్ను 62కోట్లతో అభివృద్ది చేస్తున్నారు. 150 కోట్లతో పాలకుర్తి చుట్టూ డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

అభివృద్దికి పెద్దపీట వేసి పాలకుర్తి రూపురేఖలే మార్చేశారు. నియోజకవర్గ కేంద్రంలో అనుకున్నదాని కంటే ఎక్కువగానే అభివృద్ది జరిగినప్పటికి.. ఇతర ప్రాంతాల్లో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండగా.. మరికొన్ని మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. పాలకుర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తామన్న హామీ అలానే మిగిలిపోయింది. కనీసం పోస్ట్ మార్టమ్ గది లేక జనగామకు వెళ్ళాల్సి వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.   పోస్ట్ మార్టమ్ గది ఏర్పాటుకు 2009లో ఇచ్చిన హామీ...హామీగానే మిగిలిపోయిందంటున్నారు స్థానికులు.

నీళ్ల చుట్టూ రాజకీయాలు
పాలకుర్తి ఏరియా మొత్తం మెట్టప్రాతం కావడంతో చాలా ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నూరు రిజర్వాయర్ను పాలకుర్తి రిజర్వాయర్ గా మార్చి నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తానని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరక అసంతృప్తిలో పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అయితే మంత్రి ఇటీవలనే మూడు జిల్లాల అధికారులతో సమావేశమై పనులపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

వచ్చే వేసవిలోపు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాలకు సంబంధించి బాలికల జూనియర్ కళాశాల తెప్పిస్తానని.. అదేవిధంగా డిగ్రీ కళాశాల తెస్తానని 2009 నుండి ప్రజలకు హామీ ఇస్తున్నారు.  అది కూడా పాలకుర్తి ప్రజలకు కలగానే మిగిలిపోయింది. డబుల్బెడ్ రూమ్ ఇళ్ళ కోసం లబ్డిదారులు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా, ఫలితం కనిపించడంలేదు.

ఎన్నికల్లో అభివృద్ధి పాత్ర ఎంత?
నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటి తొర్రూర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు..పట్టణాన్ని 66కోట్లతో సర్వాంగసుందరంగా అభివృద్ది చేశారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తూ ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రత్యర్థులు ఎవ్వరైనా సరే.. ప్రజలు తన వెంటే ఉంటారనే నమ్మకంతో ఉన్నారాయన.
చదవండి: దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?

నాడు వర్థన్నపేట అయినా.. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం అయినా.. ఏదైనా సొంత ఊరిలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రజలు నుంచి దయాకర్ రావుకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపద్యంలో ఇంకాస్త కష్టపడక తప్పదనే భావన కలుగుతోంది. రాబోయే ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు బలమైనవారైతే...ప్రజల మూడ్ మారితే ఎర్రబెల్లి దయాకరరావుకు చుక్కలు కనిపిస్తాయనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు