ఎల్లో బ్యాచ్‌ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్‌నాథ్‌

12 Dec, 2022 18:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ ఐటీ, పర్రిశమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రుషికొండలో అక్రమ నిర్మాణాలంటూ విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏపీతో సంబంధం లేనివాళ్లు అవాస్తవాలు మాట్లాడుతున్నారని  దుయ్యబట్టారు.

‘‘రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలను సీపీఐ నారాయణ చూశారు. అవి ప్రభుత్వ కార్యాలయాలు కావని చెప్పినా వారికి నచ్చలేదు. ఇప్పుడు రాజేంద్రసింగ్ అనే కొత్త వ్యక్తిని‌ తెచ్చి మాట్లాడించారు. ఆయన రామోజీరావుకు 20 ఏళ్లుగా స్నేహితుడు. రిషికొండ మీద‌ నిర్మాణాలన్నీ టూరిజం నిర్మాణాలు. కానీ ఆ కొండను చూస్తే కన్నీరు వచ్చినట్లు చెప్పారు. మరి అమరావతిలో పొలాలు లాక్కున్నప్పుడు రైతుల కన్నీరు కనపడలేదా?. రుషికొండ‌ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఆ పక్కన సినిమా స్టూడియో ఉంది. అవేమీ కనపడలేదా?. రామోజీరావు ఫిల్మ్ సిటీని కొండల్లో కట్టలేదా?. సముద్ర తీరంలో, కొండల మీద ఉన్న నిర్మాణాలు ఇంకెక్కడా కనపడలేదా?. విశాఖపట్నమే సముద్రంలో కలిసిపోబోతున్నదని ఇంకో‌ పత్రిక రాసింది’’  అంటూ మంత్రి దుయ్యబట్టారు.

‘‘ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఓర్వలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలను వీరు ఎందుకు ప్రశ్నించలేదు?. ఉత్తరాంధ్రపై రకరకాలుగా విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే అజెండాగా పనిచేస్తున్నారు?. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారు?. వైఎస్సార్‌ హయాంలో విశాఖ అభివృద్ధి చెందింది. ఇప్పుడు మళ్లీ జగన్ వల్ల‌నే అభివృద్ధి జరుగుతుంది’’ అని మంత్రి అన్నారు.

‘‘చంద్రబాబు చెప్పింది కొండంత.. అప్పుడు వచ్చింది గోరంత.  లక్షల కోట్ల పెట్టుబడులని ప్రచారం చేసి వేల కోట్లు కూడా తేలేదు. చంద్రబాబు హయాంలో 58 కంపెనీలు మూతపడ్డాయి. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. పవన్ కల్యాణ్‌ వారాహి ఏపీలోకి వచ్చాక ఆలోచిస్తాం. ఇక్కడ రూల్స్‌కి అనుగుణంగా ఉందా లేదా అనేది రవాణా శాఖ అధికారులు నిర్ణయిస్తారు. సైకో ఎవరో గత ఎన్నికలలో ప్రజలే నిర్ణయించారు. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చంద్రబాబే సైకో’’ అని మంత్రి అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.
చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. రూ.23, 985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

మరిన్ని వార్తలు