‘లోకేష్‌ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’

29 Oct, 2023 17:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న నారా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు. ‘లోకేష్‌ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది. దొంగలకు పోలీసుల కాల్‌ డేటాతో ఏం సంబంధం?, వ్యవస్థలను మేనేజ్‌ చేసుకునే అలవాటు మాకు లేదు. గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు. పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. 

లోకేష్‌ తండ్రితో ములాఖత్‌ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నట్లున్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనలు ఫలితాలు అందరూ చూశారు. రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు. మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం. సీమెన్స్‌ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. 130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు. దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు. 17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు.

మరిన్ని వార్తలు