నిజమైన హిందూధర్మ పరిరక్షకుడు కేసీఆర్‌

24 Jan, 2023 02:05 IST|Sakshi

వివేకానంద విదేశీ విద్యాపథకం స్కాలర్‌షిప్‌ పత్రాలు అందజేసిన మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజమైన హిందూ ధర్మపరిరక్షకుడని మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. కొంతమంది రాజకీయాల కోసం హిందూమతాన్ని వాడుకుంటున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం అలోచించే సీఎం కేసీఆర్‌ అని, బ్రాహ్మణులపట్ల అపార గౌరవం కలిగిన నేత అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ సమాజ్‌ సామూహిక భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారని అన్నారు.

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ‘వివేకానంద విదేశీ విద్యాపథకం’అర్హులకు స్కాలర్‌షిప్‌ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు అర్చకులకు పుణ్యకార్యం జరిగితేనే జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి కృషితో ప్రతీనెల అర్చకులకు జీతాలు సమయానికి వచ్చే వ్యవస్థ ఏర్పాటైందని వివరించారు. దేవాలయాల కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

విదేశీవిద్య కోసం ఈ ఏడాది 121 మందికి రూ.24.20 కోట్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వేద విద్యార్ధులకు నెలకు రూ.250, వేదవిద్య పూర్తయ్యాక వృత్తిలో నిలదొక్కుకునేందుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో కొత్త బ్రాహ్మణభవన్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, తెలంగాణ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు