తగ్గేదేలే.. కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌ సవాల్‌.. 

1 Dec, 2022 17:35 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల వార్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి.. మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. కేంద్ర ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు సిద్దమంటూ ఓపెన్‌ సవాల్‌ చేశారు. 

కాగా, మంత్రి హరీష్‌.. గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈనెల 7వ తేదీన సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ భవనం, పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడి టీఆర్‌ఎస్‌ తలపెట్టిన సభ ఏర్పాట్లను హరీష్‌ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ గోబెల్స్‌ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. పన్నుల్లో​ 42 శాతం కాదు.. కేవలం 29.6 శాతం మాత్రమే ఇస్తోంది. కేంద్ర బడ్జెట్‌ కోసం దొడ్డిదారిన సెస్‌ల రూపంలో కేంద్రం వేలకోట్లు వసూలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో 20 శాతం సెస్‌ల రూపంలోనే వస్తోంది. 

మంత్రి కిషన్‌ రెడ్డి.. రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇస్తున్నామని అంటున్నారు. కానీ, 29.6 శాతమే ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు నావద్ద ఉన్నాయి. దీనిపై చర్చకు కిషన్‌రెడ్డి సిద్దమా అంటూ ఓపెన్‌ సవాల్‌ విసిరారు. 42 శాతం నిధుల పేరుతో కేంద్రం.. రాష్ట్రాల్లోని పలు పథకాలను రద్దు చేసిందన్నారు. దీని వల్ల తెలంగాణ వేల కోట్లు నష్టపోయిందని తెలిపారు. బండి సంజయ్‌ కూడా తలాతోక లేకుండా మాట్లాడాతారు. 8 ఏళ్ల కాలంలో కేంద్రం కోటి కోట్ల అప్పు చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, నిరుద్యోగులను మోసం, కాంట్రాక్ట్‌ పద్దతిలో కొందరికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు