మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంపై హరీష్‌ రావు ఫైర్‌

8 Feb, 2023 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ దేశ ప్ర‌జ‌ల‌ను మోదీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. సంవ‌త్స‌రానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వ‌లేదని ప్రస్తావించారు. అర్హులైన వాంద‌రికి ఇండ్లు అని ప్ర‌క‌టించారు.. అది అడ్ర‌స్ లేకుండా పోయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయ‌లేదు. న‌దుల అనుసంధానం కాలేదని విమర్శించారు.

 ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెపై చర్చ సందర్భంగా బుధవారం మంత్రి మాట్లాడుతూ.. నల్ల చట్టాలను వ్యతిరేకించినందుకే రైతులపై కక్ష పెట్టుకున్నారని మండిపడ్డారు. మీరా మాకు నీతులు చెప్పేదంటూ ​కేంద్రంపై నిప్పులు చెరిగారు. కిసాన్‌ అన్న పేరు కనిపిస్తే చాలు నిధుల్లో కోత పెడుతున్నారని విమర్శించారు. జీడీపీని మంట‌గ‌ల‌ప‌డంలో బీజేపీ స‌క్సెస్ అయిందని ఎద్దేవా చేశారు.

‘ఫుడ్ సెక్యూరిటీని నాశ‌నం చేయ‌డంలో, రూ. 160 ల‌క్షల కోట్ల అప్పులు చేయ‌డంలో, సెస్సుల రూపంలో అడ్డ‌గోలుగా ప‌న్నులు వేయ‌డంలో, సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డంలో, ప‌సి పిల్ల‌లు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించ‌డంలో, ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్ట‌డంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్ర‌భుత్వం స‌క్సెస్ అయింద‌ని హ‌రీష్‌ రావు చుర‌క‌లంటించారు.

మరిన్ని వార్తలు