అమిత్‌షా కొడుకు క్రికెటరా? ఎలా అధ్యక్షుడయ్యాడు: మంత్రి హరీష్‌ రావు

26 May, 2022 19:54 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాక మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర, హర్యానా వంటి ఎన్నో రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పెత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. అమీత్‌షా కొడుకు ఏమైనా క్రికెటరా.. ఆయన బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. తెలంగాణను కుటుంబంగా భావించి పాలిస్తున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని వ్యాఖ్యానించారు.

పేదల గురించి బీజేపీ ఎప్పుడైనా ఆలోచించిందా అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. పెట్రోల్‌, బీజిల్‌ రేట్లను పెంచి పేదల నడ్డీ విరుస్తోందని మండిపడ్డారు. మాయమాటలు చెప్పి మోసం చేయడం బీజేపీ నైజమని విమర్శించారు. తెలంగాణ గురించి మాట్లాడి హక్కు మోదీకి లేదని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేస్తే.. తెలంగాణను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐటీహబ్‌గా మార్చిందన్నారు.

‘బీజేపి చేసేది గోరంతా చెప్పేది కొండంత. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం. అమ్మకానికి మోడీ, నమ్మకానికి కేసీఆర్ అంబాసిడర్. సిల్వర్ జూబ్లీకి వచ్చి మోదీ చిల్లర మాటలు మాట్లాడాడు. ఓట్ల కోసం సంజయ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సంజయ్ వ్యాఖ్యలు అర్థ రహితం. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను మోదీ మరిచిపోయారు. తెలంగాణకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తుంది.అంత ప్రేమ ఉంటే  మా వాటా మాకు ఇవ్వండి’ అని కేంద్రంలోని మోదీ సర్కార్‌పై హరీష్‌ రావు నిప్పులు చెరిగారు.
చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’

మరిన్ని వార్తలు