ఏడేళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు: హరీశ్‌ రావు

13 Nov, 2021 08:11 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

కృష్ణా జలాల వివాదంపై మంత్రి హరీశ్‌రావు

దీనిపై రాష్ట్రం ఏర్పడిన  42వ రోజే ఫిర్యాదు చేశాం 

మాకు న్యాయమైన నీటి వాటా ఇవ్వాలి.. కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి

సాక్షి, సిద్దిపేట: కృష్ణా జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని, గొంతెమ్మ కోరికలేవీ కోరట్లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే అంటే.. 2014 జూలై 14నే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై సెక్షన్‌ 3 కింద అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అభ్యంతరం తెలపడాన్ని, తెలంగాణ చేసిన జాప్యం వల్లే ఈ అంశం పెండింగ్‌లో ఉందని పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఇది 4 నెలల నుంచి కాదు.. ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్య అని గుర్తుచేశారు.

షెకావత్‌ వ్యాఖ్యలు సరికాదని, సీఎం వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నట్లుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉందని, సమస్య పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కేంద్రం 13 నెలలపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోనందున 2015 ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ విషయంలో ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని హరీశ్‌ విమర్శించారు. 

ఏడాదిగా స్పందించలేదేం? 
‘సీఎం కేసీఆర్‌తోపాటు నీళ్ల మంత్రిగా నేను, అధికారులు ఢిల్లీకి ఏడాది తిరిగినా మీరు (షెకావత్‌) స్పందించలేదు. సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఉంటే సుప్రీంను ఆశ్రయించాల్సిన అవసరం రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా మొదటి ప్రాధాన్యం నీళ్లకు ఇచ్చాం. ఇది సీఎం కేసీఆర్‌కు నీళ్ల మీద, రాష్ట్రం మీద ఉన్న తపన. వారి కృషికి, పట్టుదలకు ఒక నిదర్శనం. దీన్ని షెకావత్‌ అర్థం చేసుకోవాలి. మీ (షెకావత్‌) మీద ఉన్న గౌరవంతో అందరినీ సంప్రదించి సుప్రీంకోర్టులో కేసును విత్‌డ్రా చేసుకున్నాం’అని హరీశ్‌ గుర్తుచేశారు.

కేంద్రం ఏడేళ్లుగా ఈ వ్యవహారాన్ని నాన్చడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఈ అంశాన్ని ప్రస్తుతమున్న బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు అనుసంధానించడమో లేదా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడమో చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా కావాలన్నదే మా ఆవేదన. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా తపన, వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, శివ కుమార్, యాదవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.  

చదవండి: (కేసీఆర్‌ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌)

మరిన్ని వార్తలు