పీయూష్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు

23 Dec, 2021 05:22 IST|Sakshi

మిమ్మల్ని అడుక్కోవడానికి ఢిల్లీకి రాలేదు. వడ్ల సేకరణ మీ బాధ్యత. పంటల సేకరణ మీ పరిధిలో ఎందుకు పెట్టుకున్నారు? చేతగాకపోతే ఎగుమతి, దిగుమతి అంశాలను రాష్ట్రాలకు బదిలీ  చేయండి.. అంతేగానీ చేతులెత్తేస్తే ఊరుకోం.. -హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతులను రోడ్డు మీదకు తీసుకొస్తే ఊరుకోబోమని ఆర్థికమంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసిందని, 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందజేస్తోందని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వ చేయూతతో వరి సాగు చేసిన రైతులు వడ్లు అమ్ముకునేందుకు చలిలో వణుకుతుంటే, వారి తరఫున రాష్ట్ర మంత్రులు ఆరుగురు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. వారిని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అవహేళన చేయడం అభ్యంతరకరం అన్నారు. ‘ఏం పనిలేక ఢిల్లీకి వచ్చారా’ అని గోయల్‌ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. ఇది రాష్ట్ర రైతులను అవమానించడం, అవహేళన చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానిస్తే పరవాలేదని, కానీ రైతులను అవమానిస్తే ఊరుకోబోమని.. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హరీశ్‌రావు హెచ్చరించారు.

గోయల్‌ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
రాష్ట్ర మంత్రులు 70 లక్షల మంది రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకే ఢిల్లీ వెళ్లారని మంత్రి చెప్పారు. అయితే గోయల్‌ కేంద్రమంత్రిగా రాష్ట్రంతో వ్యవహరించే తీరు సరిగా లేదని విమర్శించారు. రైతులను, రాష్ట్ర ప్రజలను అవమానించిన గోయల్‌ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

రాజకీయానికే కేంద్రం ప్రాధాన్యత..
‘బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెప్పారు.. రేపు భవిష్యత్తులో రా రైస్‌ కూడా కొనబోమంటే ఏం చేయాలి..’ అని హరీశ్‌రావు కేంద్రాన్ని నిలదీశారు. ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన 40 లక్షల టన్నుల కోటా అయిపోయిందని, మిగిలిన 30 లక్షల టన్నుల ధాన్యం కొంటారా కొనరా అని కేంద్రాన్ని అడగడానికే రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. కానీ మూడురోజులు వారికి సమయం ఇవ్వలేదని విమర్శించారు. కానీ బీజేపీ నాయకులకు మాత్రం వెంటనే టైమ్‌ కేటాయించారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఆరుగురు మంత్రులకు మించి రాష్ట్రం నుంచి మరో ఉన్నతస్థాయి బృందం ఉంటుందా? అని ప్రశ్నించారు. తమ ప్రాధాన్యత రైతులైతే, కేంద్రం ప్రాధాన్యత రాజకీయం అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మీరే రాజకీయం చేసుకుంటూ మాపైన బురద జల్లుతారా? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ పుట్టుకే ప్రజలు, రైతుల కోసమని, తమకు రైతు ప్రయోజనం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రానికి వడ్లు వద్దంట.. కానీ రైతుల ఓట్లు మాత్రం కావాలంట అని ఎద్దేవా చేశారు. 

కేంద్రమంత్రి అబద్ధాలు ఆడుతున్నారు
పీయూష్‌ గోయల్‌ అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి బియ్యం ఇవ్వలేదా? మీరు తీసుకోలేదా అని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఎలా వడ్లు కొంటున్నారో అలాగే ఇక్కడా కొనాలంటున్నామని,. దీనికి సమాధానం చెప్పకుండా ప్రత్యారోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశమంతా ఒకే పద్ధతి ఉండాలని, పంజాబ్‌లో కొన్నప్పుడు ఇక్కడెందుకు కొనరని నిలదీశారు. రాష్ట్రాన్ని కించపరిచే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వడ్లు కొంటున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వమే కొనడం లేదని చెప్పారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కూడా వడ్లు కొనాలన్నారు. ధాన్యం తీసుకోబోమని చెబితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

ఉప ఎన్నికల్లో గెలిచి విర్రవీగుతున్నారు
ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలిచి విర్రవీగుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. దేశంలో ఎన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోలేదని  ప్రశ్నించారు. ఇక్కడ రామచందర్‌రావు ఓడిపోయి వాణిదేవి గెలవలేదా అని గుర్తుచేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (కేసీఆరే సమస్యలు సృష్టిస్తున్నారు : కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌)

మరిన్ని వార్తలు