పంచుడు బీఆర్‌ఎస్‌ వంతు.. పెంచుడు బీజేపీ వంతు: మంత్రి హరీష్‌ రావు

30 Dec, 2022 16:24 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేకపోయినా నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ వ్య‌క్తి అయినా.. ప్రజలు మాత్రం తెలంగాణ వారు అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని స్ప‌ష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హ‌రీష్‌ రావు పాల్గొని ప్ర‌సంగించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక బస్టాండ్‌ చూస్తుంటే కడుపు నిండిందన్నారు. ఇక్కడ బస్టాండ్, తిరుపతి బస్సు కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కష్టడ్డారని గుర్తు చేశారు. అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చింది ఇంకోకరు అని విమర్శించారు. బీజేపీ, ఎమ్మెల్యేలను కొనే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైనికులను, గోవులను రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీదంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని మండిపడ్డారు. బీజేపీ చేరికల కమిటీ పార్టీలు చీల్చే కమిటీగా మారిందన్నారు. పక్క పార్టీలను బెదిరించి గుంజుకునే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. 400 ఉన్న సిలిండర్‌ను 1200కు పెంచారన్నారు. పెంచిన సిలిండర్‌ ధర ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. పంచుడు బీఆర్‌ఎస్‌ వంతు అయితే.. పెంచుడు బీజేపీ వంతు అని అన్నారు.

దేశంలో బీజేపీ వాళ్లు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. 30 సీట్లు రావని బీజేపీ నేత సంతోష్‌ చెప్పకనే చెప్పారు.. అంటే వాళ్లు తెలంగాణలో అధికారంలోకి రారని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలను తీసేసి,  ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. మాయమాటలు చెప్పితే మోసపోవడం ఇక కుదరదన్నారు.
చదవండి: అయ్యప్పస్వామిపై భైరి నరేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు

మరిన్ని వార్తలు