Huzurabad Bypoll-Harish Rao Comments: ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోండి

4 Sep, 2021 02:52 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు  

హుజూరాబాద్‌ ప్రజలకు మంత్రి హరీశ్‌రావు సూచన

సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి మద్దతిస్తారా?

ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న కేసీఆర్‌ వెంట నిలుస్తారా?

రిటైర్డ్‌ ఉద్యోగుల కృతజ్ఞత సభలో ప్రసంగం

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వైపు ఉంటారో లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సీఎం కేసీఆర్‌ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆర్టీసీకి ఏటా రూ. 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్‌ కాపాడుతుంటే కేంద్రం మాత్రం రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అమ్ముతోందని విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో రిటైర్డ్‌ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు రిటైర్డ్‌ ఉద్యోగులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారన్నారు.

‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే బహుమానాలు ఇస్తాం’అని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని హరీశ్‌ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి ఆస్తులు పెంచుతోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. 

ఈటల గెలిస్తే ఆయనకే మేలు.. 
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ప్రజలకు మేలు జరగాలని ఏమైనా రాజీనామా చేశారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని, కానీ ఇది ప్రజలకు నష్టమేనన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు శక్తివంతులని, ఒక్కొక్కరూ వంద మందిని ప్రభావితం చేయగలరన్నా రు. సమావేశంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, నాయకులు రాజయ్య, వి. హన్మంత్‌గౌడ్, విష్ణుదాస్‌ గోపాల్‌రావు, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు