బీజేపీ చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

10 Mar, 2021 08:41 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, పక్కన అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

 వ్యక్తిగత కక్షతోనే సీఎం కేసీఆర్‌పై విపక్షాల విమర్శలు

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌ : ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. తమ హయాంలోని అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. పట్టభద్రులు, పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు, ఐకేపీ సెర్ప్‌ ఉద్యోగులతో మంగళవారం జిల్లా కేంద్రంలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం మాట అటుంచితే 20లక్షల ఉద్యోగులను తొలగించిందని మండిపడ్డారు. నల్లడబ్బును వెనక్కి తెస్తామని అధికారంలోకి వచ్చాక డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్‌ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్ముతూ వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల నాయకులు కేవలం సీఎం కేసీఆర్‌పై వ్యక్తి గత కక్షతోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, పరిశ్రమలు స్థాపించి 15లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం తమ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. కోదండరాం ప్రతిపక్షాల కుట్రకు ఎందుకు మద్దతు పలుకుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అబద్ధాలు మాట్లాడడం ఆయనకు తగదన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మరోసారి ఆదరించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్‌రవీంద్రకుమార్, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బీబీపాటిల్, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌గౌడ్, పిల్లిరామరాజు యాదవ్, పంకజ్‌యాదవ్, కృష్ణారెడ్డి, చకిలం అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు