రైతు ద్రోహితో మళ్లీ కలిసేందుకు పవన్‌ తహతహ

10 Jun, 2022 16:33 IST|Sakshi

రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు 

ఆ ఐదేళ్లూ చంద్రబాబును సమర్థించిన పవన్‌కల్యాణ్‌ 

రైతులకు అన్నీ చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు 

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడి 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు ద్రోహి చంద్రబాబుతో మళ్లీ చేతులు కలిపేందుకు సినీనటుడు పవన్‌కల్యాణ్‌ తహతహలాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 

మంత్రి ఏమన్నారంటే.. 
రైతుల రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించి, మాట తప్పారు. రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చి, కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా వారిని మోసం చేసి రైతు ద్రోహిగా నిలిచిన చంద్రబాబును ఆ ఐదు ఏళ్లూ పవన్‌కల్యాణ్‌ సమర్ధించారు. ఆ తర్వాత ప్యాకేజీ కుదరక వ్యతిరేకించిన పవన్‌ మళ్లీ ఇప్పుడు అదే రైతుద్రోహితో కలిసేందుకు తహతహలాడుతున్నారు. అందుకే రైతులకు అన్ని విధాలుగా మేలు చేసి, వ్యవసాయాన్ని పండగలా చేసి రైతుమిత్రగా ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. 

పవన్‌కు అసలేం తెలుసు? 
ఇవాళ వ్యవసాయం, రైతుల స్థితిగతులకు సంబంధించి నటుడు పవన్‌కల్యాణ్, మహానటుడు చంద్రబాబుగారు వేర్వేరుగా, రకరకాల కామెంట్స్‌ చేశారు. ప్రధానంగా క్రాప్‌ హాలీడే గురించి మాట్లాడారు. వ్యవసాయం, వ్యవసాయ విధానం, రైతుల గురించి పవన్‌కు అసలు ఏం తెలుసు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నారు.  

అప్పుడు జరిగింది కాబట్టి.. 
చంద్రబాబు హయాంలో క్రాప్‌ హాలీడే జరిగింది కాబట్టి, ఆయన డైరెక్షన్‌లో పవన్‌ ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో వందలాది కరువు మండలాలు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు.  

ఆ దమ్ము ధైర్యం నీకున్నాయా?: 
పవన్‌.. మూడు ఆప్షన్లు ఇచ్చావు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొంటారంట..  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడూ ఎవరితోనూ జత కట్టలేదు. సింహంలా ఒంటరిగా పోటీ చేసి అందరినీ మట్టి కరిపించారు. ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా?  పవన్‌.. నీవు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఎక్కడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగిందా?   

నీకా ప్రభుత్వం భయపడేది?  
ధాన్యం సేకరణ చేస్తే, వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. అయితే నాకు భయపడి, ప్రభుత్వం రూ.139 కోట్లు ఖాతాల్లో వేసిందని చెప్పుకుంటున్నావు. పవన్‌.. నీకా ప్రభుత్వం భయపడేది?  ఈనెల 14న దాదాపు రూ.3 వేల కోట్ల క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వనున్నాం. ఇది ఒక విడతలో, ఒక ఏడాదిలో ఇస్తున్న మొత్తం. చంద్రబాబు 100 జన్మలు ఎత్తినా ఆ పని చేయగలడని హామీ ఇవ్వగలవా.. అంటూ పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు