ఇలానే ఉంటే రాష్ట్రం దివాలా

6 Jan, 2023 04:18 IST|Sakshi

కేసీఆర్‌ వైఖరితోనే జీతాలివ్వలేని పరిస్థితి 

బీఆర్‌ఎస్‌ సర్కారుది దిగజారుడుతనం 

దేశమంతా అంబేడ్కర్‌ రాజ్యాంగం.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం 

కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ధ్వజం 

రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతోనే రూ. 300 కోట్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌ ఆగిపోయాయి 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం అర్థరహితమైన విమర్శలు చేస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దేశమంతా అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రం కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం ఢిల్లీలోని తన క్యాంపు కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను గులాబీ మాఫియా దోచుకుంటోందని.. సీఎం కేసీఆర్‌ మొండివైఖరి, దుందుడుకు విధానాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలున్నాయనీ, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అస్తవ్యస్త ఆర్ధిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితే రావొచ్చన్నారు. తెలంగాణలో వస్తున్న ఆదాయాన్ని దేశమంతా వినియోగిస్తున్నారన్న బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపైనా కిషన్‌ రెడ్డి స్పందించారు. 

ఇక్కడ వసూలైన డబ్బు ఇక్కడే ఖర్చు చేస్తున్నారా? 
 ‘హైదరాబాద్‌లో వసూలైన డబ్బును హైదరాబాద్‌లోనే ఖర్చు పెడుతున్నారా? గజ్వేల్, సిద్దిపేటల్లో వసూలైన డబ్బులు అక్కడే ఖర్చు పెడుతున్నారా?’అనే విషయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం పంచాయతీల అకౌంట్లలోకి నేరుగా రూ.5,080 కోట్లు విడుదల చేస్తే .. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను డిజిటల్‌ కీల ద్వారా విడుదల చేసిన గంటల్లోనే దారిమళ్లించిందన్నారు.

ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి, దిగజారుడుతనం మరొకటి ఉండదు’అని నిందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. పేద ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన పత్రాలు అందించని కారణంగా.. కేంద్రం నుంచి రావాల్సిన రూ.300 కోట్ల స్కాలర్‌షిప్‌లు అందడం లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతలా పాలన కొనసాగిస్తున్నారని.. రోడ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు లేకపోవడంతో భూములు అమ్మేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. 

ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ రెడీ 
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న కిషన్‌రెడ్డి, తెలంగాణ సమాజం బీజేపీ బలపడాలని కోరుకుంటోందన్నారు. తెలంగాణలో 15 శాతం భూములు ఆయిల్‌ ఫామ్‌ పంటలకు అనువుగా ఉన్నాయని.. అందుకోసం కేంద్ర ప్రభుత్వం 2021–22, 2022–23 సంవత్సరాలకు గానూ రూ.114 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన ప త్రాలను కూడా మీడియాకు విడుదల చేశారు.   

మరిన్ని వార్తలు