‘రైతుల ముసుగులో టీడీపీ నేతల నాటకాలు’

18 Jul, 2021 14:46 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదని, బాబు హయాంలో ఐదేళ్లలో చెల్లించింది మేం ఏడాదిలోనే చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు రూ.5,056 కోట్లు చెల్లించాలని, ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా కూడా ఇస్తామని పేర్కొన్నారు.  చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దని, రైతులకివ్వాల్సిన డబ్బులు బాబు ఏనాడూ సకాలంలో చెల్లించలేదని తెలిపారు. రైతు రాజులా బతకాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.  చంద్రబాబుకు సామాజిక న్యాయం అంటే ఆయన కులానికే న్యాయం చేయడమని విమర్శించారు. ఆర్థిక, సామాజికంగా వెనుకబడినవారికి ఒకేసారి నామినేటెడ్‌ పదవులు ఇచ్చామని, మహిళా సాధికారత కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు.చంద్రబాబు, ఎల్లో మీడియాకు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. 

టీడీపీని విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు 
చంద్రబాబుతో బీజేపీ, జనసేన కలవవని, లోకేష్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసన్నారు. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ గెలవదని చంద్రబాబు భావిస్తున్నారని,  అందుకే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు