నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా: కొడాలి నాని

4 Sep, 2020 13:04 IST|Sakshi

చంద్రబాబే ఓ రాజకీయ భిక్షగాడు

దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

రైతుల విద్యుత్‌ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది

సాక్షి, తాడేపల్లి: రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందేలా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులు వాడుకున్న విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని శుక్రవారం పునరుద్ఘాటించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను కరెంట్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిందని.. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన హయాంలో రైతులను మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. మహానేత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తూ.. కుల, మత, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.  రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తూ.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని తెలిపారు.(చదవండి: పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?)

దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు
తనపై విమర్శలకు దిగిన టీడీపీ నేత దేవినేని ఉమాకు కొడాలి నాని ఈ సందర్భంగా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘దేవినేని ఉమా చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా..?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు. చంద్రబాబే పెద్ద భిక్షగాడు.. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్‌టీఆర్’’ అంటూ ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్‌ తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఆయన వల్లే తాను మంత్రిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. (చదవండి: రైతులకు విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమే)

‘‘పథకాలను అటకెక్కించిన ఘనత చంద్రబాబుదే. డబ్బులు కట్టలేదని కరెంటు మీటర్లు పీకించిన ఘనత ఆయనదే. ఆయన ప్రభుత్వం పెట్టిన బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించాం. అలాంటి వ్యక్తి చెబుతున్న అబద్ధాలకు ఎల్లోమీడియా వంత పాడుతోంది’’అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


 
హాస్యాస్పదంగా ఉంది: వసంత కృష్ణప్రసాద్‌
ఉచిత విద్యుత్‌ గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇప్పడు చంద్రబాబు, దేవినేని ఉమా చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. బాబు హయాంలో క్వారీలకు దేవినేని ఉమా అనుమతులు ఇప్పించారని.. త్వరలోనే టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలన్నింటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు ఏపీకి వచ్చారన్న వసంత కృష్ణప్రసాద్‌.. మంగళగిరిలో లోకేశ్‌ ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు