పిచ్చిపనులు చేస్తే ఉమానే కాదు బాబునూ వదలరు: కొడాలి నాని

28 Jul, 2021 16:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అరాచకాలతో ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దళితులు, పోలీసులను దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని.. ఉద్దేశపూర్వంగానే వారిని రెచ్చగొట్టారని తెలిపారు. అందుకే గ్రామస్తులు తిరగబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాలేమీ ఎల్లో మీడియాకు పట్టవని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జి.కొండూరు ఘటన గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘ఉమా అనుచరులే వైఎస్సార్‌ సీపీ నేత కారు అద్దాలు పగలగొట్టారు. టీడీపీ నేతలు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలపై దాడి చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబు’’ అని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

‘‘చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా. అక్కడ జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. దీంట్లో ఉమా హయాంలో అక్కడ ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేస్తున్నాం. అత్యంత ఎక్కువ మైనింగ్ ఆయన హయాంలోనే జరిగింది. అక్కడి కాంట్రాక్టర్లును డబ్బులకోసం బెదిరించాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని బెదిరించి ఆపించాడు. ఆ తర్వాత మళ్లీ దాన్ని రెవెన్యూ ల్యాండ్గా మార్పించింది ఉమానే. ఇప్పుడు అధికారం పోగానే మా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కంకర దొరక్కూడదనే ఆయన రభస చేశాడు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఉమానే కాదు చంద్రబాబుని కూడా పోలీసు శాఖ వదలదు’’ అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు