చంద్రబాబు క్యారెక్టర్‌ లెస్‌.. లోకేష్‌ బ్రెయిన్‌ లెస్‌

20 Jun, 2021 08:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో హత్యలు జరగలేదా.. జరిగిన వాటికి ఆయన బాధ్యత వహిస్తారా అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎక్కడో గ్రామాల్లో జరిగే గొడవలను సీఎం వైఎస్‌ జగన్‌కు ఆపాదించడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై లోకేష్‌ కర్నూలులో చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. గ్రామ రాజకీయాల్లో ఎవరో చనిపోతే లోకేష్‌ కర్నూలు వెళ్లి సీఎంను పత్రికల్లో రాయలేని విధంగా మాట్లాడారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన తనయుడ్ని అచ్చోసి వదిలేశారని.. దీంతో లోకేష్‌ పిచ్చికుక్కలా అరుస్తున్నాడని.. తండ్రీ కొడుకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. వారిద్దరూ ఇంటికి పరిమితమై జూమ్‌లో సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. 

బాబు దారి అడ్డదారి
రాజకీయాల్లో విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్‌ రాజకీయాలు చేస్తుంటే.. అడ్డదారిలో అయినా అధికారంలోకి రావాలని చంద్రబాబు పాకులాడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు వెయ్యి జన్మలెత్తినా, క్యారెక్టర్‌లో సీఎం జగన్‌ సాటి రారన్నారు. కాగా, లోకేష్‌కు ఇంట్లో తిండి పెట్టడంలేదని.. ఆ అసహనంతో పిచ్చి వాగుడు వాగుతున్నాడని.. తండ్రీకొడుకులు కూడా వేర్వేరు చోట్ల ఉంటున్నారని మంత్రి చెప్పారు. తాను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టు, తన కొడుకు తనకు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడనే భయంతోనే లోకేష్‌ను చంద్రబాబు ఫాంహౌస్‌లో పెట్టారని.. ఇది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు క్యారెక్టర్‌ లెస్‌ అయితే లోకేష్‌ బ్రెయిన్‌ లెస్‌ అని కొడాలి మండిపడ్డారు. జగన్‌ దమ్ము గురించి లోకేష్‌ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలు 2024లో రాష్ట్రం నుంచి శాశ్వతంగా చంద్రబాబును పంపిస్తారన్నారు.   

సీఎం జగన్‌ రైతు బాంధవుడు
ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, సున్నా వడ్డీలకు సంబంధించి చంద్రబాబు పెట్టిన రూ.4వేల కోట్ల బకాయిలను సీఎం వైఎస్‌ జగన్‌ చెల్లించారని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అయితే.. సీఎం జగన్‌ రైతు బాంధవుడని కొడాలి కొనియాడారు. అలాగే, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.996కోట్లను కూడా ముఖ్యమంత్రి చెల్లించారని గుర్తుచేశారు. 2014 ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అన్నదాతలకు మొండిచెయ్యి చూపిన నీచుడని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లు చేసి నెలరోజులైనా డబ్బులు చెల్లించడంలేదని చంద్రబాబు ఓ పిచ్చి లేఖ రాశారని.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్నామన్నారు. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 28లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. ఇందుకు సంబంధించి రూ.1,637కోట్లు చెల్లించామని.. ఇంకా రూ.1,619కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అడ్వాన్స్‌గా ఇవ్వాల్సిన రూ.3,200 కోట్లు ఇవ్వకపోయినా కూడా ప్రతిరోజు రాష్ట్ర ఖజానా నుంచి రూ.200 కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని సగర్వంగా చెబుతున్నామన్నారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మిల్లర్లు కొన్నా, కొనకపోయినా ప్రభుత్వమే ప్రతి గింజను కొంటుందని మంత్రి స్పష్టంచేశారు. కాగా, మొన్న కొంతమంది రైతులు ఊక తెచ్చి హడావుడి చేస్తే దేవినేని ఉమా అక్కడికి వెళ్లి మహిళలతో కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నారని నాని చెప్పారు.  

మరిన్ని వార్తలు