ఈటల వంద శాతం గెలవడు: కొప్పుల ఈశ్వర్‌

13 Sep, 2021 07:10 IST|Sakshi
ప్రొసీడింగ్స్‌ అందిస్తున్న మంత్రి ఈశ్వర్‌

సాక్షి, జమ్మికుంట(కరీంనగర్‌): సీఎం కేసీఆర్‌ పాలనలో రైతుల సాగునీటి, కరెంటు కష్టాలు తీరాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని కేశవాపూర్‌లో కౌన్సిలర్‌ పాతకాల రమేశ్‌ ఆధ్వర్యంలో కనకదుర్గా మాత దేవాలయ నిర్మాణానికి మంత్రి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పనులకు అవసరమైన రూ.10 లక్షల ప్రొసీడింగ్స్‌ అందించారు.

అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ వంద శాతం గెలవడని, ఒకవేళ గెలిచినా ఉత్త ఎమ్మెల్యేనే అవుతారని పేర్కొన్నారు. రైతులు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈసారి రాష్ట్రంలో అన్నదాతలు 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, భారీగా వరి ధాన్యం చేతికి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు లబ్ధి చేయని బీజేపీలో ఈటల చేరారని పేర్కొన్నారు.

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జమ్మికుంట పట్టణంలో చేయని అభివృద్ధిని తాజాగా చేసి చూపించామని తెలిపారు. అభివృద్ధి పనులే లక్ష్యంగా తాను జమ్మికుంటలోని ప్రతీ వార్డులో తిరుగుతున్నానని చెప్పారు. సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పురపాలక సంఘం చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు రావికంటి రాజ్‌కుమార్, పొనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: సెంటిమెంట్‌ డైలాగులు కడుపు నింపవు

మరిన్ని వార్తలు