టీఆర్‌ఎస్‌.. తిరుగులేనిశక్తి

8 Sep, 2021 03:28 IST|Sakshi
గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో మల్లారెడ్డి, సబిత, మహమూద్‌ అలీ

బీజేపీ, కాంగ్రెస్‌ పేరుకే ఢిల్లీ పార్టీలు.. చేసేవి చిల్లర పనులు: కేటీఆర్‌

విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపు 

టీ–కాంగ్రెస్, టీ–బీజేపీ ఏర్పాటు కేసీఆర్‌ భిక్షేనని వెల్లడి 

గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీలో పాల్గొన్న మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుకే బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీ పార్టీలని.. కానీ, చేసేవి చిల్లర పనులని ఎద్దేవా చేశారు. మంగళవారం జలవిహార్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతలని అన్నారు.

టీ–కాంగ్రెస్, టీ–బీజేపీ ఏర్పాటు కేసీఆర్‌ పెట్టిన భిక్షేనని.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోని నేతలు కేసీఆర్‌ పుణ్యాన పదవులు రాగానే ఎగిరిపడుతున్నారని ధ్వజమెత్తారు. వయసులో పెద్దవారైన సీఎంపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లు ఒపిక పట్టినా.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదన్నారు. మీరు ఇటుకలతో బదులి స్తే.. మేము రాళ్లతో జవాబు చెప్తామని పునరుద్ఘాటించారు.

అరవై లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని.. హుజూరాబాద్‌ ఎన్నిక పార్టీకి ఒక సమస్యే కాదని చెప్పారు. పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసునని, వారి ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌కు ఏమీ కాదన్నారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలన్నారు. ఈ నెల 20 లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేసి.. దీపావళి తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు.

అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ జయభేరీ.. 
అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ ఎన్నికలు.. జిల్లా పరిషత్‌ ఎన్నికలు.. పార్లమెంట్‌ ఎన్నికలు.. ఏదైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని కేటీఆర్‌ చెప్పారు. ఏడేళ్లుగా పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి త్వరలో నామినేటెడ్‌ పోస్టులు కట్టబెడతామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కో ఆప్షన్‌ సభ్యుల నియామకం సైతం త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

‘చేనేత’కు రూ. 73.50 కోట్లు.
నేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా చేనేత కార్మికుల తలసరి ఆదాయం పెరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని చేనేత, జౌళి రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నేత కార్మికుల తలసరి ఆదాయం రూ.15 వేలకు పైగా పెంచేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. నేత కార్మికుల సమస్యలపై గత నెలలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మళ్లీ మంగళవారం అధికారులతో భేటీ అయ్యారు.

‘చేనేత’సంక్షేమం కోసం కార్మిక సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేటీఆర్‌ ఆమోదించారు. ఈ పథకాల అమలుకు వీలుగా రూ.73.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను చేనేత కార్మికులు, సహకార సంఘాలకు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.     

మరిన్ని వార్తలు