మా భూములు వెనక్కిచ్చేయండి

20 Jun, 2022 01:38 IST|Sakshi

పీఎస్‌యూల అమ్మకంపై కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్‌ లేఖ

కేంద్ర పీఎస్‌యూలను ‘అడ్డికి పావుశేరు’ లెక్కన అమ్ముకుంటున్నారు

పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో తెలంగాణలోని సంస్థల ఆస్తుల అమ్మకం!

ఆరు సంస్థలకు 7,200 ఎకరాలు కేటాయించిన గత ప్రభుత్వాలు

ఇప్పుడు వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 వేల కోట్లు

ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తాం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆయా భూములను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూలు) కేంద్రం అమ్ముకుంటోందని ధ్వజమెత్తారు.

దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా మోదీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తులను అమ్ముకునే పనిలో ఉందని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ‘అడ్డికి పావుశేరు’రీతిన అమ్ముకుంటోందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి ఎన్నో రాజ్యాంగబద్ధ హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వేల కోట్ల విలువైన సంస్థల విక్రయం
దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న హిందుస్తాన్‌ కేబుల్స్‌ లిమిటెడ్, హిందుస్తాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ లిమిటెడ్, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను మోదీ ప్రభుత్వం అమ్ముతోందని తెలిపారు.

ఈ అరు సంస్థలకు గత రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7,200 ఎకరాల భూమిని కేటాయించాయని, ఇప్పుడు వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని, ఇక బహిరంగ మార్కెట్‌లోనైతే రూ.40 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే ప్రభుత్వాలు భూములు కేటాయించాయని కేటీఆర్‌ గుర్తుచేశారు. 

ఆ ఆస్తులు తెలంగాణ ప్రజల హక్కు
కేంద్ర ప్రభుత్వం విక్రయించాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేట్‌ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్మడమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న కేంద్రానికి, రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 

అమ్మొద్దు..పునరుద్ధరించండి
తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి బదులు వాటిని పునరుద్ధరించి బలోపేతం చేయాలని కోరారు. అలా కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. పాత పరిశ్రమలను ప్రారంభించే వీలు లేకుంటే, ఆ భూములను రాష్ట్రానికివ్వడం ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు