పదవులు కాదు.. పార్టీ శాశ్వతం: కేటీఆర్‌

22 Jan, 2021 03:08 IST|Sakshi

విభేదాలు సహజం..

సామరస్యంగా పరిష్కరించుకోవాలి 

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. పార్టీ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. పార్టీ ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తా యి. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ఏవైనా మంచి ఫలితాలు సాధించాలి. రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. వాటిని సామరస్యం గా పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ పార్టీ నేతలు, యంత్రాంగాన్ని సమన్వయం చేయాలి. నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలి’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలకు హితబోధ చేశారు.

ప్రగతిభవన్‌లో గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్‌ సమావేశమై త్వరలో జరిగే శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు, జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతో కలిసి సుమారు 40 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్‌.. జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. 

కలసికట్టుగా పనిచేయండి 
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో నాయకత్వం మూడు విధాలుగా ఉంది. ఇందులో ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారు, 2018 ఎన్నికలకు ముందు చేరిన వారు, 2018 తర్వాత పార్టీలోకి వచ్చిన వారు ఉండ టంతో నాయకుల నడుమ అక్కడక్కడ సమన్వయ లోపం ఉంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అక్కడక్కడ ఫిర్యాదులున్నా పార్టీ పరంగా మనవైపు వైఫల్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తయ్యేలా మీరందరూ కలసికట్టుగా పనిచేయండి. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిం చాలి. పట్టభద్రుల కోటా ఎన్నికకు సంబంధించి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి సమన్వయంతో విజ యం సాధించాలి’అని కేటీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు.

గంటలోపే ముగింపు..  
కాగా, పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘ సమావేశం ఉంటుందని భావించినప్పటికీ సీతారామ సాగర్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఉండటంతో కేటీఆర్‌తో జరిగిన సమావేశం కేవలం గంట వ్యవధిలోపే ముగిసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యనేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం ప్రారంభానికి ముందే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాగా, కేటీఆర్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని నేతలు వెల్లడించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు