‘మోదీ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు’

3 Oct, 2023 19:32 IST|Sakshi

ఎన్డీఏలో చేరడానికి మాకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా?

ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు

యువరాజు అంటూ ఏదేదో వ్యాఖ్యానించారు

నేను సీఎం కావడానికి మోదీ పర్మిషన్‌ అవసరమా?

అందుకే బీజేపీని జుమ్లా పార్టీ అనేది

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  తాము కూడా ఎన్డీఏలో చేరతామని  తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన వద్దకు గతంలో వచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  తాము ఎన్డీఏలో ఎందుకు చేరతామన్న కేటీఆర్‌.. తమకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా? వారితో కలవడానికి అంటూ ఎదురుప్రశ్నించారు. 

‘ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ఇలానే మాట్లాడతారు. మోదీ వ్యాఖ్యలు బాధాకరం.. శోచనీయం. మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతా అవినీతి సీఎంలే. ప్రధాని స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. యువరాజు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే బీజేపీని జుమ్లా పార్టీ అనేది.  జయ్‌షా ఎవరు.. బీసీసీఐ సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చారు?, మోదీ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నేను సీఎం కావడానికి మోదీ పర్మిషన్‌ అవసరమా?,

గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదు. అదానీ విషయంలో ఎందుకు వెనుకడుగువేశారు?, ఇప్పుడు ఎన్డీఏను కీలక పార్టీలు వదిలేశాయి.. వారికి మిగిలింది ఈడీ.. సీబీఐనే. మేము ఢిల్లీ గులామ్‌లు కాదు..గుజరాతీ బానిసలం కాదు.  ఎన్డీఏ అనేది మునిగిపోయే నావ.. అందులోకి వెళ్లాలని మేము ఎందుకు అడుగుతాం. ఎన్డీఏలో మేము ఎందుకు చేరతాం.. మాకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా?, కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ డబ్బులిచ్చిందని మోదీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే జై కొడతారు’ అని కేటీఆర్‌ తెలిపారు.

చదవండి: ఇదే కేసీఆర్ సీక్రెట్: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు