ఆ పాపమే చంద్రబాబుకు శాపంగా మారింది...

5 Apr, 2021 12:11 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీకి భయం పట్టుకుందని.. అందుకే పరిషత్ ఎన్నికల నుంచి ఆ పార్టీ పారిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం అయిపోయిందని.. టీడీపీ, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు.

గతంలో పవన్ భారీ డైలాగ్‌లు చెప్పారు.. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు.. తిరుపతిలో మోదీ ప్రత్యేక హోదా హామీ పవన్‌కు గుర్తులేదా? అని కన్నబాబు ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ ఎద్దేవా చేసింది పవన్‌కు గుర్తులేదా అని విమర్శించారు. ‘‘పవన్ కల్యాణ్‌ ఒక్క మాటపై నిలబడే వ్యక్తి కాదు. బీజేపీని ప్రశ్నించాల్సింది పోయి.. మాపై ఎలా విమర్శలు చేస్తారు?. విభజన హామీల గురించి బీజేపీని పవన్ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించరు?. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకా హత్య జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌కి, సీఎం రమేష్‌కి మధ్య ఫోన్‌ సంభాషణలు పవన్‌కు తెలియదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారు.

ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. వైఎస్ వివేకా హత్య కేసును వైఎస్ జగనే సీబీఐకి అప్పగించారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరుగుతుందని పవన్ తెలుసుకోవాలి. సీబీఐకి విచారణ అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. మీ మిత్ర పార్టీనే విచారణ చేస్తుంది కదా? మమ్మల్ని ఎలా తప్పుబడతారు?. ఆనాడు సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంది చంద్రబాబు కాదా? టీడీపీ హయాంలో జగన్‌పై హత్యాయత్నం జరిగితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ’’ కన్నబాబు ప్రశ్నించారు.

విజయవాడలో ఆలయాలను కూల్చిన పాపమే చంద్రబాబుకు శాపంగా మారిందన్నారు. అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తే కేంద్రం ఎందుకు స్పందించలేదంటూ కన్నబాబు నిలదీశారు. ఆలయాలపై పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో పవన్ కల్యాణ్ చెప్పాలన్నారు. గ్యాస్‌, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో పవన్ చెప్పాలన్నారు. తిరుపతిలో గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్, లోకేష్‌ను చూసి ఇదో అజ్ఞానపు సంత అని జనం నవ్వుకుంటున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.

 చదవండి:
అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!
కళా వెంకట్రావు ఓ డిక్టేటర్‌.. ఆడియో హల్‌చల్‌

మరిన్ని వార్తలు