కరోనా వల్ల ఏ పంటల ధరలూ పడిపోలేదు

23 Apr, 2021 09:57 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

భయపెట్టేలా ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్పుడు కథనాలు

చంద్రబాబు కోసం శ్మశాన వార్తల స్థాయికి దిగజారారు

కనీస సామాజిక బాధ్యత లేదా?

రైతులకు నష్టం చేయొద్దు

లాక్‌డౌన్‌ లేదని ప్రధానే చెప్పారు.. ఎగుమతులపైనా ఆంక్షల్లేవ్‌

ఇక పండ్ల రేట్లు ఎందుకు తగ్గుతాయి? 

సాక్షి, అమరావతి: కరోనా వల్ల రాష్ట్రంలో ఏ పంటల ధరలూ తగ్గలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అలాంటి వార్తలు రాసి రైతులకు నష్టం చేయవద్దని, కనీస సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ‘కరోనా పేరుతో ప్రజలను భయపెడతారా?.. శవాల గుట్టలంటూ దిగజారుడు కథనాలు రాయడం న్యాయమేనా?’ అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్న కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. పంటల ధరలు తగ్గాయని తప్పుడు ప్రచారం చేయడానికి ఇది సమయం కాదని హితవు పలికారు.

టీడీపీ హయాం కన్నా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగాయని అంకెలతో సహా వివరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోసం రెండు పత్రికలు శ్మశాన వార్తలు రాసేస్థాయికి దిగజారడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. గుంటూరు శ్మశాన వాటికలో గుట్టలుగా కరోనా చితి మంటలని వార్తలు రాయడం వెనుక ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర దాగి ఉందన్నారు. కరోనాపై ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి రోజూ బులెటిన్‌ విడుదల చేస్తుంటే మరణాలను దాచిపెడుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. 

సీఎం జగన్‌ రైతు పక్షపాతి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతి. వ్యవసాయానికే ప్రాధాన్యమిస్తున్నారు. పంటల ధరలు పడిపోతున్నాయని ఈనాడులో రాయడం విడ్డూరం. రెండు రోజులు సెలవుల వల్ల గుంటూరు మిర్చి యార్డ్‌లో 4 లక్షల బస్తాల మిర్చి ఉంది. 26 నుంచి యార్డుకు మిర్చి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి మిర్చి ధర గతేడాది  రూ. 11 వేల నుంచి రూ.12 వేలుంటే..  ఇప్పుడు రూ.15 వేలు ఉంది. çమిర్చిని కనీస మద్దతు ధర జాబితాలో చేర్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే.

పండ్ల ధరలెందుకు తగ్గుతాయి?
మామిడి, బత్తాయి ధర తగ్గుతోందని ఆ పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవం. గతేడాది కన్నా ఈసారి మామిడి ఉత్పత్తి తగ్గింది. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్‌లు మూతపడటంతో గతేడాది రాష్ట్రంలో వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడా సమస్యే లేదు. ధర ఎందుకు తగ్గుతుంది? బత్తాయికి టన్నుకు ప్రభుత్వం రూ.14 వేలు మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో  టన్ను రూ. 50 వేలు పలుకుతోంది. లాక్‌డౌన్‌ ఉండదని ప్రధానే ప్రకటించినప్పుడు.. ఎగుమతికి ఆటంకం లేనప్పుడు... ఇక ధర ఎందుకు తగ్గుతుంది? కందులు,పెసలు, మినుములు, శనగలు,  వేరు శనగ, పత్తి, మిర్చి, ఉల్లి, బత్తాయి. పసుపు ఇవన్నీ కనీస ధర కన్నా ఎక్కువకే అమ్ముడుపోతున్నాయి. మొక్కజొన్నకు గతేడాది క్వింటాలు రూ.1,750 ఉంటే ప్రభుత్వం ఈ ఏడాది రూ.1,800 ప్రకటించింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా పెద్ద ఎత్తున కొంటోంది. జొన్నకు గ్రేడ్‌ ఎంఎస్‌పీ పెట్టింది. ఏం పంటనూ గాలికొదిలేయలేదు.

లోకేష్‌కు బుర్రలేదు
కరోనా కష్టకాలంలో సీఎం జగన్‌ ప్రజలకు తోడుగా వారి వెంటే ఉన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్‌ను ప్రజలు బుర్రలేని నాయకుడు అని అంటున్నారు. టెన్త్, ఇంటర్‌ సర్టిఫికెట్లు అత్యంత విలువైనవి. పరీక్షలు లేకుండా పాస్‌ చేస్తే వాటికి విలువ ఉంటుందా? అందుకే కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు జరపాలనుకుంటున్నాం. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? కోవిడ్‌ను అడ్డుపెట్టుకుని ఆస్పత్రులు, మందుల షాపులు దోపిడీకి పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. 

గ్రామాల్లోనే కొనుగోలు
రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే  పంటలను కొనుగోలు చేస్తోందీ ప్రభుత్వం. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ.2 వేల కోట్లు ప్రకటించినప్పటికీ అంతకంటే ఎక్కువే ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో  2015–16 నుంచి 2018–19 వరకూ  మొత్తం కొనుగోలు చేసిన  పంటలు 8,50,823 మెట్రిక్‌ టన్నులు. దీనికి రూ.3,557 కోట్లు మాత్రమే చెల్లించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధాన్యం కాకుండా 2019–20, 2020–21లో 15,11,811 మెట్రిక్‌ టన్నుల రైతు ఉత్పత్తులను సేకరించి  రూ.5,550 కోట్లు వెచ్చించింది. రూ.18 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం 23 పంటలకు ఎంఎస్‌పీ ప్రకటిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ అదనంగా మిర్చి పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు అరటి. బత్తాయికి కనీస మద్దతు ధర ప్రకటించారు. 

చదవండి: రామోజీ రూటే వేరు...నిజాలెక్కడ?

మరిన్ని వార్తలు