‘బాబు ఇంట్లోనే ఉంటే మంచిదని కోరుతున్నా’

4 Oct, 2020 14:19 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇంకా తాను అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో దేశం‌ మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్ధానంలో ఉందని చెప్పారు. మంత్రి కన్నబాబు కాకినాడలో మీడియాతో ఆదివారం మాట్లాడుతూ... ‘చక్కటి పరిపాలనతో సీఎం జగన్‌ కరోనాను ఎదుర్కోంటున్నారు. ఇప్పుడొచ్చి చంద్రబాబు కరోనా సమస్యలపై తమ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అంటున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు హైదరాబాద్‌లో ఉండి గుమ్మం దాటి బయటకు రాలేదు. 

చంద్రబాబుకు అమరావతి, అచ్చెన్నాయుడు గోల తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు. పరిపాలన కోసం సీఎం జగన్‌గారికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబుతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ముందు మీరైతే కరోనా రాకుండా జాగ్రత్త పడండి. ప్రజల కోసం చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆందోళన పడితే .. మీ ఆరోగ్యానికి ఇబ్బందులు రావొచ్చు. కరోనా తగ్గే వరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని చంద్రబాబును కోరుతున్నా’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం)

మరిన్ని వార్తలు