చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి

8 Dec, 2021 13:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్‌ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్‌ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు.

టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు.

చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చే​స్తున్నారని పెద్దిరెడ్డి  మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు.

టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ‍ ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆది మూలపుసురేష్‌ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు.

ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు.  అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు