‘నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలే ఊతకర్ర’

12 Jun, 2022 11:44 IST|Sakshi
వి.కోట ర్యాలీలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ, డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, హాజరైన ప్రజలు

వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

గతంలో పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో కరువు విలయతాండవం 

పచ్చ పత్రికలను ప్రజలు నమ్మరు

పార్టీలకతీతంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు 

రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి,పలమనేరు/వి.కోట: అభివృద్ధి జరగలేదని బజాయించే ఎల్లో మీడియా, టీడీపీ నాయకులకు గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బీఎంసీలు, వెల్‌నెస్‌ సెంటర్లు కంటికి కనిపించలేదా అని రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆయన పలమనేరు నియోజకవర్గం వి.కోటలో శనివారం వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అక్కడ జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కరువు కాటకాలు విలయతాండవం చేసేవన్నారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఈ మూడేళ్లలో క్రమం తప్పకుండా వర్షాలు కురవడంతో కరువు పారిపోయిందని చెప్పారు. నేడు రైతులు పంటలను సాగుచేస్తూ గ్రామాలు కళకళలాడుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు.  వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసని, అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేడు కులమతాలు, పార్టీలకతీతంగా ఇంటింటికీ చేరుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పచ్చ పత్రికలు చూస్తే బాగుంటుందన్నారు. 

పార్టీలకతీతంగా పథకాలు  
నలభైఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు  చేయలేని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో చేసిచూపెట్టిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలను గుర్తించారని చెప్పారు. దేశం మెచ్చుకున్న సచివాలయ వ్యవస్థను రూపొందించి పార్టీలకతీతంగా పథకాలను అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఇక ఎప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు.  వచ్చే ఎన్నికలే కాదు.. ఎన్ని ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీదే అధికారమని, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు ఎన్‌.రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, డీసీసీబీ చైర్మన్‌ మొగసాల రెడ్డెమ్మ, వి.కోట సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీపీ యువరాజ్, రాష్ట్ర కార్యదర్శులు నాగరాజ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్‌ బాలగురునాథ్, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మొగసాల రెడ్డెప్ప నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలు, మీడియా ఊతకర్రగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కాదని వక్రీకరించి వార్తలు రాసినంత మాత్రాన జనం నమ్మరు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో దీటైన జవాబు చెబుతాం. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా వైఎస్సార్‌ సీపీదే విజయం. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సంక్షేమ పాలన సాగిస్తారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కరువు ఎక్కువగా ఉండే పడమటి మండలాల్లో సైతం 
వరుణుడు కరుణించాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ మెజారిటీ 32 వేలయితే, రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి 

చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే 

మరిన్ని వార్తలు