పవన్‌ కల్యాణ్‌ ఆటలో అరటిపండు

29 Dec, 2020 16:18 IST|Sakshi

పవన్‌కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ధ్వజం

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఓడిపోగానే మోదీ కాళ్ల దగ్గరకు చేరిన పవన్‌.. చిడతలు కొట్టాడని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నేను వైఎస్‌ఆర్‌కు భక్తుడిని. నాది స్వామిభక్తి.. చచ్చిపోతూ కూడా వైఎస్‌ కుటుంబానికే భజన చేస్తా. డబ్బులు కోసం చిడతలు కొట్టే వాడిని కాదు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడం చిడతల నాయుడికే చెల్లింది. 2014లో హైటెక్స్‌లో మీటింగ్‌ పెట్టి మోదీకి చిడతలు కొట్టింది పవనే. నెల తిరక్కముందే చంద్రబాబుకు చిడతలు కొట్టారని’’ పేర్ని నాని విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘సినిమాల్లో వకిల్‌ సాబ్‌.. బయట పకీర్‌ సాబ్‌’)

‘‘గతంలో తుపానుల వల్ల రైతులు నష్టపోతే.. చంద్రబాబు, పవన్‌ ఎంతిచ్చారు?. నువ్వు, నీ పార్టనర్‌ కలిసి ఎగ్గొట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా మేమే చెల్లించాం. పవన్‌ కల్యాణ్‌ వకీల్‌ ఎప్పుడయ్యాడు? ఏ యూనివర్శిటీలో పవన్‌ కల్యాణ్‌ లా చేశాడు. పవన్‌ వకీల్‌ అన్నది ఎంత నిజమో? రైతుల పట్ల ఆయన చేసిన పోరాటం అంతే నిజం. పవన్‌ కల్యాణ్‌ ఆటలో అరటిపండు. మా ఇంటికొస్తే పచ్చడి అన్నమే.. చంద్రబాబు ఇంటికెళ్తే సూట్‌కేసు. చంద్రబాబుకు తప్ప చిడతలనాయుడు ఎవరికీ అండగా నిలబడలేదు. సహస్రకోటి నాయుడుల్లో నువ్వొక బోడి నాయుడివి. నకిలీ వకీల్‌ సాబ్‌.. మోదీ సాబ్‌కు చెప్పండి. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇమ్మని. గిరిజన రైతులకు, అసైన్డ్‌ రైతులకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు. సినిమాలు మానేయమని చిడతల నాయుడికి ఎవరు చెప్పారు. వందల కోట్ల సంపాదనను వదులుకుని వస్తున్నానని చెప్పింది చిడతల నాయుడు కాదా?’’ అంటూ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు.(చదవండి: బాబుపై సీఎం జగన్‌ వ్యంగ్యాస్త్రాలు)

మరిన్ని వార్తలు