ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీది

13 Feb, 2022 17:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారు. అప్పుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు.

చదవండి: (రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స)

చంద్రబాబు, జీవీఎల్, సోమువీర్రాజుని ప్రశ్నిస్తున్నా. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పాలి. ఏపీ ప్రజలను వాగ్ధానాలతో మోసం చేశారా లేదా. ప్రత్యేక హోదాపై అప్పుడు ఇచ్చిన మాటను నిలబెడతారా.. చేతులెత్తేశారా. బీజేపీ పిల్లిమొగ్గలు వేసే పరిస్థితుల్లో ఉందా. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలాలు అనుభవిస్తున్నాయా లేదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టమా, లేదా..?. ఏపీపై బఠాని గింజంత చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నేతలు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీరా కాదా.. టీడీపీ సమాధానం చెప్పాలి. ప్యాకేజీ పేరుతో టోకుగా అమ్మేసింది మీరా కాదా. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీది. హోల్‌సేల్‌గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి ఏం చేశారు.

చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్‌ కుమార్‌)

కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో ప్రత్యేకహోదా పెట్టడం దేశ ద్రోహమా. ఎందుకు చంద్రబాబు, జీవీఎల్ పట్టుబట్టి అజెండా నుంచి తీయించేశారు. జీవీఎల్ ఎందుకు భయపడ్డాడు. ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా.. చెప్పాలి. జీవీఎల్‌కు ఎందుకంత ఆత్రం. అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా. ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కనకమేడల ఏ కలుగులో దాక్కున్నారు. అజెండా నుంచి హోదాను తీసేయగానే ఎందుకు బయటికొచ్చారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ బాగుపడుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈర్ష్య, అసూయలతో నీచరాజకీయాలు మానుకోవాలని టీడీపీ, ఏపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని అన్నారు. 

మరిన్ని వార్తలు