-

నయీం చంపుతానంటేనే భయపడలేదు, మీరెంత: ఈటల

20 Jul, 2021 02:09 IST|Sakshi

ఈటల రాజేందర్‌ తీవ్ర ఆరోపణలు

హత్యా రాజకీయాలకు భయపడను.. ప్రజల మధ్యే ఉంటా

దుబ్బాకలో ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది.. వరంగల్‌ 

అర్బన్‌ జిల్లా నుంచి ప్రజాదీవెన యాత్ర ప్రారంభించిన ఈటల

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తనను చంపించేందుకు తమ జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపిం చారు. హంతక ముఠాలతో ఆయన చేతులు కలిపి నట్లు మాజీ నక్సలైట్ల ద్వారా తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. హత్యా రాజకీయాలకు భయ పడనని, ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ మంత్రితో పాటు సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లె నుంచి ‘ప్రజాదీవెన పాదయాత్ర’ను ఈటల ప్రారంభిం చారు. బత్తినివానిపల్లె, శ్రీరాములపేట, శనిగరం, మాదన్నపేటలలో జరిగిన సభల్లో జాతీయ, రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. 

నయీమ్‌ బెదిరిస్తేనే భయపడలేదు
‘అరె కొడుకుల్లారా ఖబడ్దార్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో నరహంతకుడు నయీమ్‌ వంద ఫోన్లు చేసి చంపుతా అంటేనే భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడిని, ఈటల మల్లయ్య కొడుకుని. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల బిడ్డ ఈ ఈటల రాజేందర్‌. వారి ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతా. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడా జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడూ నిలుస్తారు..’ అని ఈటల చెప్పారు.

పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు
‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ రజాకార్లను తలపిస్తు న్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారు. ఈ విషయం నాకు తెలుసు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజూరాబాద్‌ నుంచే మొదలవుతుంది. ఓడిపోతామన్న భయంతో కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చిల్లర పనులు చేస్తున్నారు. గూండా గిరీ చేస్తున్నారు. పాద యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తు న్నారు. భోజన విరామం కోసం బుక్‌ చేసుకున్న రైస్‌ మిల్లును సీజ్‌ చేశారు. అన్నం వండటానికి తెచ్చుకున్న సామాన్లను ఓ గదిలో వేసి తాళం వేశారు. ఇదేం సంస్కృతి? ప్రజలను భయభ్రాం తులకు గురిచేయాలని చూసే వారికి గుణపాఠం తప్పదు. పాదయాత్రకు అడుగడు గునా అడ్డంకులు కల్పించాలని చూస్తే ఖబడ్దార్‌..’ అంటూ ఈటల హెచ్చరించారు. పోలీసులు పాదయాత్రకు సహకరించాలని కోరారు.

దళిత బంధును స్వాగతిస్తున్నాం కానీ..
‘దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చుడు కాదు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల మందికి లబ్ధి జరిగేలా చూడాలి. ఎన్నికల ముందు వాగ్దా నాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవ డం సీఎం కేసీఆర్‌కు అలవాటే. హుజూరా బాద్‌లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. చింతమడకలో అమలయ్యే పథకాలు, స్కీములు మా హుజూరాబాద్‌ బిడ్డలకు కూడా అందాలి..’ అని ఈటల డిమాండ్‌ చేశారు. 

కేసీఆర్‌ ఈరోజు నిద్రపోరు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండెల్లో ఈటల రాజేందర్‌ నిద్రపోతాడని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఈ జనాన్ని చూసి కేసీఆర్‌ ఈ రోజు నిద్రపోరని అన్నారు. గూండా నాయకుల్లారా.. దుర్మార్గానికి దిగితే మీకు రామదండు దాడి తప్పదంటూ హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. తమను రెచ్చగొడితే ఇటుకకు సమాధానం కంకర రాళ్లతో ఉంటుందన్నారు. మండలానికి ఒకరిని మర్డర్‌ చేసిన ముద్దసానిని ఢీకొట్టి గెలిచిన ఈటల ఎవరికీ భయపడ రన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కూడా మాట్లాడారు. పాదయాత్రకు ముందు ఈటల.. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో తన సతీమణి జమునతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. జానపద నృత్యాలు, కులవృత్తుల జీవన విధానాలను ప్రతిబింబించేలా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సాగిన పాదయాత్రలో సీనియర్‌ నాయకులు వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు 127 గ్రామాల మీదుగా 270 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. 
  

మరిన్ని వార్తలు