టీడీపీని పైకెత్తలేక.. జాకీలు విరిగిపోతున్నాయి

5 Jul, 2022 08:09 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లా : నానాటికీ అధఃపాతాళానికి పడిపోతున్న టీడీపీని జాకీలు పెట్టి పైకి లేపడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఎల్లో మీడియా సంస్థలు ఎంత ప్రయత్నిస్తున్నా అవి విరిగిపోతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గుమ్ములూరు, బూరుగుపూడి గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గుమ్ములూరులో యోగ ముద్రలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), వైఎస్సార్‌ హెల్త్‌ సెంటర్‌తో పాటు, జగనన్న కాలనీ – పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మించిన ఇంటిని ప్రారంభించారు.

అలాగే బూరుగుపూడి అల్లూరి సీతారామరాజు కాలనీలో కంటే సత్తిబాబు, వినయ్‌తేజ రూ.4.50 లక్షలతో నిర్మించిన జక్కంపూడి రాజా కల్యాణ వేదికను ప్రారంభించారు. అక్కడున్న సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమ్ములూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రోజా మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికీ సొంత కొడుకులా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం అందజేస్తున్నారని అన్నారు. సచివాలయాలు, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్ల వంటి వాటి ద్వారా పాలనను, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. రాజకీయాలకు, రికమండేషన్లకు తావు లేకుండా అర్హులందరికీ పథకాలు అందుతున్నాయన్నారు. 

టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామంటూ ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మరో నాయకుడు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు. దీంతో సీఎం జగన్‌పై అక్కసుతో ఉన్న భీమ్లానాయక్‌ బిగుసుకుపోయాడని, చంద్రబాబు, లోకేష్‌ నీరుగారిపోయారని రోజా తనదైన శైలిలో విమర్శించారు. 

ఈ కార్యక్రమాల్లో రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్‌రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్‌ నక్కా రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ఉల్లి బుజ్జిబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ క్రొవ్విడి సర్రాజు, మాజీ సర్పంచులు కంటే వీర వెంకట సత్యనారాయణ, మట్టా పెద్ద వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు