బాబుకు ఐటీ నోటీసులు ఇస్తే పవన్‌ ఎందుకు స్పందించడం లేదు?: మంత్రి రోజా

4 Sep, 2023 14:21 IST|Sakshi

సాక్షి, తిరుమల: నారా చంద్రబాబుపై, లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని ఏపి మంత్రి ఆర్.కే.రోజా మండిపడ్డారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన సమయంలోనూ చంద్రబాబు అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారని ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంత్రి రోజా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

దర్శనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇల్లు గానీ లేకపోయినా హైదరాబాద్‌ నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారని సెటైర్లు వేశారు. లోకేష్ ఊరు ఊరికి పోయి మొరుగుతున్నాడు, ప్రతి ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తున్నారని చెప్పారు.  చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకున్న పవన్ ఊగిపోతూ, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌తో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  ఆయన ఇంట్లో సోదాలు చేస్తే దాదాపు రూ. 118 కోట్ల రూపాయలు నల్లధనం లెక్కలు లేకుండా దొరికిందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పనుల్లో దొంగ బినామీల పేరుతో దోచుకున్నారని, చంద్రబాబు, లోకేష్‌పై సీబీఐ విచారణ వేయించి జైల్లో పెట్టాలన్నారు. పేద ప్రజలను దోచుకోవడమే కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్న పవన్.. చంద్రబాబుపై ఐటీ అధికారులు సోదాలు చేస్తే ఎందుకు ట్వీట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.
చదవండి: ‘విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి’

చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దాలను నిజాలంటూ చెప్పే పవన్ ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాడో అందరికి అర్ధం అవుతుందన్నారు. భార్యలను చూసుకోలేని మోదీ దేశాన్ని ఎలా చూసుకుంటాడోనని అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేశారని, అమిత్ షా తిరుమల కొండకు వస్తే చంద్రబాబు రాళ్ళు వేయించిన ఘటనలు వాళ్ళు మరిచి పోలేదని అన్నారు.

హైదరాబాదులో రూ. 600 కోట్ల రూపాయలతో చంద్రబాబు ఇళ్ళు కట్టారని, ఆ ఇంటి వద్దకు ఎవరూ వెళ్ళలేక పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇంటిపై సోదాలు చేసి చంద్రబాబుపై, లోకేష్‌పై సీబీఐ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపడంతో పాటు పవన్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు

మరిన్ని వార్తలు