సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని మంత్రి రోజా ద్వజమెత్తారు. ఎంతసేపు చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్.. ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అవ్వడు ఇది నా శాసనమన్న పవన్‌ను ప్రజలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడెందుకు రాష్ట్రలో తిరుగుతున్నాడో అర్థం కావడం లేదని విమర్శించారు.
షూటింగ్ గ్యాప్‌లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే ప్రజలు అవే తిరిగి చూపిస్తారని మంత్రి రోజా హెచ్చరించారు. ఆయనను ఒక నటుడిగా అంతా గౌరవిస్తారని, వీకెండ్ రైటప్స్‌తో వస్తే జనం ఆదరించరనిపేర్కొన్నారు. సినిమా హీరో వస్తే ఓట్లేసేస్తారనే రోజులు పోయాయన్నారు. జనసేన అధినేత తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. పవన్‌తో పాటు ఆయన అన్నలను కూడా జనం ఓడించారని ప్రస్తావించారు. సొంత ఊర్లలోనే అన్నదమ్ములు చిత్తుగా ఓడిపోయారంటే తమ మీద ప్రజలకు నమ్మకం లేదని తెలుసుకోవాలని హితవు పలికారు.
చదవండి: పవన్‌కు తెలిసిందల్లా బాబుకు చెంచాగిరీ చేయడమే: మంత్రి జోగి రమేష్
పోలవరంపై పవన్ విమర్శలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించకుండా పవన్ ఏం చేశాడని నిలదీశారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడని, కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని కమిషన్ల కోసం నాశనం చేసినప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. చంద్రబాబును అడగకుండా గతంలో గాడిదలు కాశావా అంటూ మండిపడ్డారు. ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఈరోజు మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని అన్నారు.
‘ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటా ఓడిపోయారు. రచ్చా ఓడిపోయారు. రాజకీయమంటే పార్ట్ టైమ్ కాదు. ఫుల్ టైమ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం సీఎం కుర్చీ కోసమే రాజకీయం చేస్తామంటే సినిమాల్లోనే కుదురుతుంది. ఇప్పటికే వారానికి ఓసారి రాష్ట్రానికి వచ్చి పోతున్నాడు. ఈసారి జనం ఓడిస్తే రాష్ట్రం చుట్టుపక్కలకు కూడా రాడు. పార్టీ మూసేస్తే హైదరాబాద్ వెళ్లిపోతారు.బీసీల మీద పవన్‌కు అసలు ప్రేమ లేదు. బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు వెనక తోకలా తిరిగే వ్యక్తి పవన్. పవన్ పక్కన ఆయన అన్న, నాదెండ్ల మనోహర్ తప్ప బీసీలెవరైనా ఉన్నారా? వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని నోటికొచ్చిన్నట్లు మాట్లాడితే పవన్‌కు ప్రజలే దేహశుద్ధి చేస్తారు పవన్ కల్యాణ్ ఆయన వారాహి గంగలో దూకినా ఎవరూ పట్టించుకోరు’ అని మంత్రి రోజా దుయ్యబట్టారు.
చదవండి: ‘చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడింది’